తెలంగాణ ప్రజలు తీర్పు ఏమిటి?

December 08, 2018


img

పూలనావలాగ అలఓకగా సాగిపోవలసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కురుక్షేత్రరణరంగాన్ని తలపించాయి. ఇంకా చెప్పాలంటే లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావింపబడిన మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే దేశంలో అందరి దృష్టిని ఆకర్షించాయని చెప్పవచ్చు. కారణాలు అందరికీ తెలుసు. 

సిఎం కేసీఆర్‌ తన ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓటేయమని ప్రజలను అడిగితే, ప్రభుత్వ వ్యతిరేకతను తెలివిగా ఉపయోగించుకొని ఎన్నికలలో గెలవాలని ప్రజాకూటమి గట్టి ప్రయత్నాలు చేసింది. 

ఇప్పటికే అనేక సర్వేలు తెరాస గెలుపును ఖాయం చేశాయి. ఒకటి రెండు సర్వేలలో హంగ్ అవకాశం ఉందని చెప్పగా, లగడపాటి మాత్రం తెరాసకు 25-45, ప్రజాకూటమికి 55-75 సీట్లు వస్తాయని, కానీ ప్రజాకూటమే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చునని చెప్పడం విశేషం. 

ఈవిధంగా ఎగ్జిట్ పోల్స్ లో కూడా స్పష్టత రాకపోవడంతో ప్రజలలో కొంత అయోమయస్థితి కనిపిస్తోంది. కనుక పార్టీలకు, రాజకీయాలకు, మీడియా లెక్కలకు అతీతంగా నిష్పక్షపాతంగా ఈ ఎన్నికలను విశ్లేషించి చూడవలసిన అవసరం ఉంది. 

తెరాస విషయానికి వస్తే “నాలుగేళ్లలో మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని మీ కళ్ళ ముందే ఉన్నాయి. కనుక వాటిపై చర్చించుకొని మేము చేసినవి నిజమని నమ్మితేనే మాకు ఓట్లు వేయండి. లేకుంటే మాకు డిపాజిట్లు రాకుండా ఓడగొట్టండి,” అని సిఎం కేసీఆర్‌ చాలా నిర్భయంగా ప్రజలను కోరారు. అంటే ఆయన ‘పాజిటివ్ ఓట్’ ను నమ్ముకొన్నారని అర్ధమవుతోంది. ఆయన చెప్పిన మాటలు నూటికి నూరు శాతం వాస్తవమే కనుక తెరాస చేసిన ఆ మంచి పనులకు 119లో 60 సీట్లు ఖచ్చితంగా లభించవచ్చు. 

అయితే ఆ మంచి పనుల కారణంగానే మాకు 100కు పైగా సీట్లు వస్తాయని తెరాస నేతలు గట్టిగా నమ్ముతున్నారు...చెప్పుకొంటున్నారు కదా? అంటే వారు ఆవిధంగా చెప్పుకోవడం సహజమే అవసరం కూడా ఎందుకంటే, ప్రజాకూటమి నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటునందున తెరాస శ్రేణులలో ఆత్మవిశ్వాసం నింపడం, ప్రజలలో తెరాస గెలుపు ఖాయం అనే భావనను వ్యాపింపజేయడం కోసమని చెప్పవచ్చు.    

ఇక తెరాసకు 100 కంటే తక్కువ సీట్లే వస్తాయని సర్వేలన్నీ ముక్తకంఠంతో ఎందుకు చెపుతున్నాయి? అంటే, దానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 

1. ప్రజాకూటమి అనూహ్యంగా ఐక్యత ప్రదర్శించి బలపడటం. 

2. కేసీఆర్‌ పాలనలో లోపాలను, వైఫల్యాలను ప్రజాకూటమి నేతలు ప్రజల మనసులలో నాటుకొనేవిధంగా ఎన్నికల ప్రచారం చేయడం. 

3. ప్రజాకూటమిలో కాంగ్రెస్‌, టిడిపి, సిపిఐ నేతల స్వంత బలం (అంగబలం, అర్ధబలం, రాజకీయ శక్తియుక్తులు), ఆయా నియోజకవర్గాలపై వారికున్న పట్టుతో గెలిచే అవకాశాలు కలిగి ఉండటం. 

4. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని వాదిస్తూ, మళ్ళీ ప్రధాని నరేంద్రమోడీతో బలమైన స్నేహసంబందాలు కొనసాగిస్తూ కేసీఆర్‌ తన విస్వసనీయతపై ప్రజలకు అనుమానాలు కలిగించడం. 

5. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్ళారో ప్రజలకు సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోవడం వలన ప్రజలలో ఏర్పడిన అసంతృప్తి.    

6. కొన్ని హామీలను అమలు చేయకపోవడం.

7. ప్రజలలో సహజంగానే ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత. 

8. సింగరేణి, ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాల వ్యతిరేక ఓట్లు.    

9. ఎన్నికల ప్రచార సమయంలో సైతం కేసీఆర్‌ ప్రదర్శించిన అహంభావం ప్రజాకూటమి నేతల వాదనలను మరింత బలపరిచేవిధంగా ఉండటం వంటి అనేకానేక కారణాలు కనబడుతున్నాయి. 

వీటన్నిటి కారణంగా తెరాస ఖాతాలో పడవలసిన 40 పాజిటివ్ సీట్లు ప్రజాకూటమి ఖాతాలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లెక్కన తెరాసకు 60-65, మజ్లీస్: 5-6, ప్రజాకూటమి: 40-50, బిజెపి:4-5, స్వతంత్ర అభ్యర్ధులకు 5-6 సీట్లు లభించవచ్చు. 

ఇప్పుడు తెరాస, మజ్లీస్ పార్టీలను కలుపుకొంటే వాటికి 65-71 స్థానాలు లభించవచ్చునని స్పష్టం అవుతోంది. కనుక రాష్ట్రంలో తెరాస మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. కానీ ఆశించినంతగా ‘పాజిటివ్ ఓట్’ రాకపోతే అందుకు తెరాస స్వయంకృతాపరాధాలే కారణమని చెప్పవచ్చు. కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే ఈసారి ఎన్నికలలో తెరాసకు వ్యతిరేకంగా ‘హైలైట్’ అయిన లోపాలను, వైఫల్యాలను సవరించుకొని ముందుకు సాగడం మంచిది. 


Related Post