మన తెలంగాణ పోలీసులు...శభాష్

December 08, 2018


img

శుక్రవారం తెలంగాణలో జరిగిన పోలింగులో చిన్నచిన్న గొడవలు తప్ప ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలింగ్ చాలా ప్రశాంతంగా ముగిసింది. కేంద్రం, ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన భద్రతాదళాలు పోలింగు సజావుగా సాగడానికి చాలా తోడ్పడినప్పటికీ, వారందరినీ చక్కగా వినియోగించుకొని ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించినందుకు ఆ క్రెడిట్ తెలంగాణ పోలీస్ శాఖకే దక్కుతుందని చెప్పవచ్చు. 

పోలింగుకు సుమారు నెలరోజుల ముందుగానే చక్కటి ప్రణాళిక తయారు చేసుకొని దానిని అంతే ఖచ్చితంగా అమలుచేయడం వలననే ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని చెప్పవచ్చు. ఒకపక్క ఎన్నికల సంఘం అధికారులను, మరోపక్క జిల్లా, నియోజకవర్గం స్థాయి పోలీస్ అధికారులను సమన్వయపరుచుకొంటూ పోలింగ్ కోసం రాష్ట్ర పోలీస్ శాఖ చేసిన ముందస్తు భద్రతా ఏర్పాట్లను చూసి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అంత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం వలననే ఈ ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు సైతం ఎక్కడా పోలింగ్‌ బూత్‌లవైపు కన్నెత్తి చూడలేకపోయారు. ఎక్కడా ఎటువంటి అలజడి సృష్టించలేకపోయారు. నిజానికి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్ (78.49), అదిలాబాద్ (76.05), మంచిర్యాల (64.28), భూపాలపల్లి (65.26) తదితర ప్రాంతాలలోనే రాజధాని హైదరాబాద్‌(50.86) కంటే ఎక్కువ ఓటింగ్ శాతం నమోదు అయ్యిందంటే ఆ క్రెడిట్ ఖచ్చితంగా తెలంగాణ పోలీసులదేనని చెప్పవచ్చు. ఇందుకు తెలంగాణ పోలీస్ శాఖలో అందరికీ మై.తెలంగాణ.కామ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తోంది.


Related Post