రేవంత్‌ అరెస్ట్ కేసులో ఎస్పీ సస్పెండ్

December 05, 2018


img

కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్‌ నుంచి పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శించిన రాష్ట్ర ఎన్నికల సంఘంపై కేంద్ర ఎన్నికల సంఘం, హైకోర్టు కన్నెర్ర చేయడంతో దిద్దుబాటు చర్యలలో భాగంగా వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను అక్కడి నుంచి బదిలీ చేసింది. ఆమె స్థానంలో 2005 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన అవినాష్ మహంతిని జిల్లా ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

తెరాస నేతలు రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేయడంతో ఆయనపై చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి డీజిపిని ఆదేశించింది. డిజిపి ఆదేశాల మేరకే వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. హైకోర్టులో ప్రభుత్వ అటార్నీ జనరల్ కూడా అదే చెప్పారు. నిఘా వర్గాల సమాచారం మేరకు రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయవలసి వచ్చిందని చెప్పారు. అంటే ఎన్నికల సంఘం, తనపై అధికారుల ఆదేశాల మేరకే ఆమె రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారని అర్ధమవుతోంది. వారి ఆదేశాల ప్రకారం నడుచుకొన్న ఆమెపై బదిలీ వేటు వేసి శిక్షించారు. ఇది ఒక పొరపాటు అనుకొంటే, ఆమెను బదిలీ చేయడం ద్వారా రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయడం పొరపాటు అని అంగీకరించినట్లు అయ్యింది. అలాగే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగడంలేదనే విషయం కూడా అంగీకరించినట్లయింది. కనీసం ఇకనైనా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి తమ విశ్వసనీయతను కాపాడుకొంటే గౌరవంగా ఉంటుంది.


Related Post