ఇబ్రహీంపట్నంలో మల్ రెడ్డిదే గెలుపు!

December 04, 2018


img

ఇటీవల సోషల్ మీడియాలో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ అభ్యర్ధి మల్ రెడ్డి రంగారెడ్డికి, మరో ఇద్దరు అభ్యర్ధులకు లగడపాటి రాజగోపాల్ స్వయంగా ఫోన్ చేసి, తాజా సర్వే ప్రకారం మీరు గెలవబోతున్నారని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో ఇటువంటి పుకార్లు సహజమే కనుక వాటిని ఎవరూ నమ్మలేదు. కానీ ఆ వార్తలు నిజమని నేడు స్పష్టం అయ్యింది. 

లగడపాటి రాజగోపాల్ ఈరోజు సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ తన తాజా సర్వే ప్రకారం మల్ రెడ్డి రంగారెడ్డి విజయం సాధించబోతున్నారని ప్రకటించారు. అలాగే మక్తల్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న జలంధర్ రెడ్డి, బెల్లంపల్లి నుంచి పోటీ చేస్తున్న జి‌.వినోద్ (బి.ఎస్.పి) గెలువబోతున్నారని ప్రకటించారు. తన సన్నిహితులలో ముగ్గురు అభ్యర్ధులు గెలువబోతున్నారని వారి పేర్లు తరువాత ప్రకటిస్తానని చెప్పారు. 

ఈ ఎన్నికలలో ఎవరు గెలిచినా ఓడినా తనకు తేడా ఉండదని కేవలం రాజకీయాలపై ఆసక్తితో సర్వే చేయిస్తున్నట్లు లగడపాటి తెలిపారు. కనుక నిష్పక్షపాతంగా సర్వే చేయించి అభ్యర్ధుల విజయావకాశాల గురించి తెలుసుకొంటున్నానని చెప్పారు. ఒకవేళ 68.5 శాతం పోలింగ్ నమోదు అయితే తన ఈ అంచనాలు నిజమయ్యే అవకాశం ఉందని, అంతకు మించి పోలింగ్ శాతం ఉంటే తన లెక్కలు తప్పవచ్చునని లగడపాటి చెప్పారు. 

ఈసారి ఎన్నికలలో ఒక్కో జిల్లాలో ఓటర్లు ఒక్కో విధంగా స్పందిస్తున్నారని అన్నారు. ఉమ్మడి కరీంనగర్, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో తెరాస-ప్రజాకూటమి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి వరంగల్, నిజామాబాద్‌, మెదక్ జిల్లాలలో తెరాసది పైచెయ్యిగా కనిపిస్తోందని అన్నారు. 

లగడపాటి మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. ఈసారి ఎన్నికలలో బిజెపి మరికొన్ని సీట్లు అధనంగా గెలుచుకొనే అవకాశం ఉందని చెప్పారు. మజ్లీస్ పార్టీకి అన్ని స్థానాలలో చాలా అనుకూలంగా ఉందని చెప్పారు. డిసెంబరు 7వ తేదీ సాయంత్రం పోలింగ్ ముగియగానే తన సర్వే పూర్తి నివేదికను ప్రకటిస్తానని చెప్పారు.


Related Post