తెరాస, ప్రజాకూటమి అనుకూల, ప్రతికూలాంశాలు

December 04, 2018


img

ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాసకు ఎదురే ఉండదు...అవలీలగా 100కు పైగా సీట్లు సాధిస్తామని కేసీఆర్‌ భావిస్తే అనూహ్యంగా ప్రజాకూటమి నుంచి గట్టి సవాలు ఎదుర్కోవలసివస్తోంది. ప్రజాకూటమి గట్టి పోటీ ఇస్తుండటంతో ఈ ఎన్నికలు కూడా కురుక్షేత్ర రణరంగాన్ని తలపిస్తునట్లు సాగుతున్నాయి. అయితే ఈ ఎన్నికలలో తెరాస, ప్రజాకూటమి గెలుపోటములను ఏది ఎక్కువ ప్రభావితం చేయబోతోంది? అనే సందేహం కలుగుతోంది. 

తెరాస విషయానికి వస్తే కేసీఆర్‌, ఆయన అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పధకాలు తెరాస అభ్యర్ధులకు శ్రీరామరక్షగా నిలువబోతున్నాయని చెప్పవచ్చు. దానికి తోడు తెరాస పటిష్టమైన ఎన్నికల వ్యూహాలు, కేటిఆర్‌, హరీష్ రావు, కవిత వంటి హేమాహేమీల ఎన్నికల ప్రచారం కూడా తెరాస విజయానికి దోహదపడుతుంది. తెరాసకు మరికొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అధికారం చేతిలో ఉండటం...పుష్కలంగా అంగబలం, అర్ధబలం కలిగి ఉండటం, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులలో కొందరు గత నాలుగేళ్ళలో తమతమ నియోజకవర్గాలను చక్కగా అభివృద్ధి చేసుకొని మంచి పౌరసంబంధాలు కలిగి ఉండటం, అలాగే మరికొందరు ప్రజలను ఆకట్టుకొనే మంచి వాగ్ధాటి కలిగి ఉండటం తెరాసకు కలిసి వచ్చే అంశాలే. అలాగే తెరాసలో సిఎం కేసీఆర్‌ మొదలు అభ్యర్ధుల వరకు సామాన్య ప్రజలకు సైతం ఆకట్టుకొనే విధంగా అచ్చమైన తెలంగాణ మాండలికంలో మాట్లాడటం కూడా వారికి బాగా కలిసి వచ్చే అంశమేనని చెప్పవచ్చు. 

ఇక తెరాసకు కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారనే ప్రశ్నకు తెరాస ఇంతవరకు సంతృప్తికరమైన సమాధానం చెప్పలేక తడబడుతోంది. తెరాస-బిజెపి రహస్య బంధం గురించి జరుగుతున్న వాదోపవాదాలు కేసీఆర్‌ విశ్వసనీయతను ప్రశ్నార్ధకంగా మార్చాయని చెప్పక తప్పదు. తాను ఎవరి ఏజంటును కానని తెలంగాణ ప్రజల ఏజంటునని కేసీఆర్‌ సర్దిచెప్పుకోవలసి వచ్చిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రజలలో కేసీఆర్‌ పాలన పట్ల సంతృప్తి ఉన్నప్పటికీ, కొందరు ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి, దురహంకారం వంటివి ఈ ఎన్నికలలో తెరాసకు ఎంతో కొంత నష్టం కలిగించవచ్చు. అలాగే మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకపోవడంతో తమ పట్ల చిన్న చూపు ఉందనే భావన మహిళలలో కనిపిస్తోంది. ఈ పాయింటును కాంగ్రెస్‌ మహిళా నేతలు తమ ఎన్నికల ప్రచారంలో బాగానే ఉపయోగించుకొంటున్నారు.  

ఇక డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ఉద్యోగాల భర్తీ, పంటరుణాల మాఫీ, సింగరేణి కార్మికులకిచ్చిన హామీల అమలులో వైఫల్యం, దళితుల పట్ల వివక్ష, రైతుల ఆత్మహత్యలు, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల పట్ల కటినంగా వ్యవహరించడం, మీడియాపై అణచివేత ధోరణివంటివన్నీ తెరాసకు ప్రతికూలాంశాలని చెప్పవచ్చు. ఇవన్నీ ప్రజాకూటమికి అనుకూల అంశాలుగా మార్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి.  

ఇక ప్రజాకూటమి అభ్యర్ధుల సంగతి చూస్తే, వారిలో చాలా మంది తమ స్వంత బలం, వ్యక్తిగతంగా, రాజకీయంగా తమకున్న గుర్తింపు, ప్రజాధారణ, అంగబలం, అర్ధబలంతో పోటీ చేస్తున్నవారే ఎక్కువగా కనిపిస్తారు. కనుక వారి జయాపజయాలు వారి సామర్ధ్యంపైనే ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు. 

ప్రజాకూటమిలో నాలుగు పార్టీలు కలిసి పోటీ చేస్తునందున వాటిలో ఒక పార్టీ ఓట్లు మరొక పార్టీ అభ్యర్ధికి బదిలీ అవుతాయో లేదో ఖచ్చితంగా చెప్పలేము కానీ ఆ అవకాశాలు ఎంతో కొంత ఉండటం వారికి కలిసి వచ్చే అంశమే. 

ఇక హామీల అమలులో తెరాస ప్రభుత్వ వైఫల్యాలు, తెరాసలో నియంతృత్వ, అప్రజాస్వామిక పోకడలపై రాష్ట్ర ప్రజలలో నెలకొనున్న అసంతృప్తి ప్రజాకూటమి అభ్యర్ధులకు కలిసివచ్చేవే. అందుకే వీటన్నిటిపై ప్రజాకూటమి నేతలు సిఎం కేసీఆర్‌ను గట్టిగానే నిలదీస్తున్నారు. ప్రజలను ఇవన్నీ ఆలోచింపజేయడం సహజం కనుక ఇది ప్రజాకూటమికి కలిసి వచ్చే అంశమేనని చెప్పవచ్చు. 

కానీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే తెరాస ప్రశ్నకు ప్రజాకూటమిలో ఎవరూ సమాధానం చెప్పలేకపోవడం, ప్రజాకూటమిని చంద్రబాబునాయుడు వెనుక నుంచి నడిపిస్తున్నారని, అది అధికారంలోకి వస్తే రాష్ట్రం మళ్ళీ ఆయన చేతుల్లోకి వెళ్లిపోతుందనే తెరాస వాదనలను ప్రజాకూటమి గట్టిగా ఖండించలేకపోవడం, ప్రజాకూటమి ఇస్తున్న హామీలను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అమలుచేస్తుందా లేదా అనే అనుమానాలు దానికి ప్రతికూలాంశాలుగా కనబడుతున్నాయి. 

ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకోవాలంటే తెరాసకు కేసీఆర్‌, అభివృద్ధి, సంక్షేమ పధకాలు శ్రీరామరక్షగా నిలిస్తే, తెరాస నియంతృత్వ పాలన, హామీల అమలులో వైఫల్యాల కారణంగా ప్రజలలో తెరాస పట్ల నెలకొన్న వ్యతిరేకత ప్రజాకూటమికి వరంగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు.


Related Post