అవును కొడంగల్‌ ఇప్పుడు హైటెన్షన్ విద్యుత్ తీగే

December 04, 2018


img

కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి చెప్పినట్లు ఇప్పుడు కొడంగల్‌ నిజంగానే హైటెన్షన్ విద్యుత్ తీగలాగ మారిందని చెప్పవచ్చు. కొడంగల్‌లో జరుగబోయే సిఎం కేసీఆర్‌ సభను అడ్డుకొనేందుకు నేడు కొడంగల్‌ బంద్ కు ఆయన పిలుపు ఇచ్చినందుకు పోలీసులు ఈరోజు తెల్లవారుజామున ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో కొడంగల్‌లో తీవ్ర ఉద్రిక్తవాతావరణం నెలకొని ఉంది. కేసీఆర్‌ సభను అడ్డుకొనేందుకు కాక ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేసినందుకు కొడంగల్‌లో బంద్ జరిగే అవకాశం ఉంది.

ఈసారి రేవంత్‌రెడ్డి కొడంగల్‌ కంచుకోటను బద్దలుకొట్టి ఆయనను ఓడించాలని తెరాస చాలా పట్టుదలగా ఉన్నందునే సిఎం కేసీఆర్‌, మంత్రులు కేటిఆర్‌, హరీష్ రావు, ఈటల వంటి హేమాహేమీలు కొడంగల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసే ముందు కొడంగల్‌లో నేడు కేసీఆర్‌ సభ నిర్వహించి ఆ నియోజకవర్గ ప్రజలను తెరాస వైపు తిప్పుకోవాలనుకోవడం చాలా మంచి వ్యూహమే. కానీ ఎన్నికల ప్రచారంలో కీలకమైన ఈదశలో ఆయనను అరెస్ట్ చేసి తప్పటడుగు వేసిందని చెప్పవచ్చు. తద్వారా కొడంగల్‌ నియోజకవర్గం ప్రజలలో ఆయనపై సానుభూతి పెరగవచ్చు కనుక రేవంత్‌రెడ్డి మరింత భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఏర్పడింది. అలాగే కీలకమైన ఎన్నికల సమయంలో ఆయనకు ఎన్నికల ప్రచారం చేసుకొనే అవకాశం లేకుండా చేసేందుకే రాజకీయ దురుదేశ్యంతోనే ఆయనను అరెస్ట్ చేసారని కాంగ్రెస్‌, ప్రజాకూటమి నేతలు ఆరోపించడం ఖాయం. ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులను, వారి అనుచరులను పోలీసులు సోదాలు, అరెస్టులు, బెదిరింపులతో భయబ్రాంతులను గురిచేస్తూ పరోక్షంగా తెరాసకు సహకరిస్తున్నారని, రాష్ట్రంలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవంటూ ప్రజాకూటమి నేతలు, వంటేరు ప్రతాప్ రెడ్డి వంటి పలువురు అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. రేవంత్‌రెడ్డి అరెస్టుతో వారి వాదనలకు బలం చేకూరింది. అయితే రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసినా చేయకపోయినా ఆయన తెరాసకు గట్టి సవాలు విసురుతారు. అరెస్ట్ చేయడంతో కొడంగల్‌ నియోజకవర్గంలో ఆయనకు అనుకూల పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అలాగే ప్రజాకూటమి నేతలకు కూడా కీలకమైన ఈదశలో తెరాస ఒక బలమైన ఆయుధం అందించిందని చెప్పవచ్చు. దానిని వారు ఎంత సమర్ధంగా ఉపయోగించుకొంటారో అలాగే ఈ పరిణామాలు రేవంత్‌రెడ్డికి, ప్రజాకూటమికి అనుకూలంగా మారకుండా ఉండేందుకు తెరాస ఏవిధంగా వ్యవహరిస్తుందో చూడాలి.


Related Post