ముస్లిం రిజర్వేషన్లపై తెరాస-బిజెపిల తొండాట!

December 03, 2018


img

ముస్లింల రిజర్వేషన్ల అంశంపై తెరాస, బిజెపిలు ఊహించినట్లుగానే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయిప్పుడు.  ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపాలని మేము భావిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం దానిని త్రొక్కిపట్టి ముస్లింలకు తీరని అన్యాయం చేస్తోందని, లోక్ సభ ఎన్నికలలో గెలిచిన తరువాత కేంద్రం మెడలు వంచి ముస్లింలకు రిజర్వేషన్లు సాధించిపెడతానని సిఎం కేసీఆర్‌ మళ్ళీ కొత్త హామీ ఇస్తున్నారు. 

సీఆర్‌ తన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీల కోటాలో కోతపెట్టి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని దురాలోచన చేస్తున్నారని, కానీ మా కంఠంలో ప్రాణం ఉండగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వబోమని అమిత్ షా, తదితరులు తెగేసి చెపుతున్నారు.  

అయితే కొన్ని నెలల క్రితమే సిఎం కేసీఆర్‌ ఒకానొక సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ, “ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించవలసిన ఆవశ్యకత గురించి నేను స్వయంగా ప్రధాని మోడీకి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు,” అని చెప్పారు. అదే నిజమైతే మరిప్పుడు ముస్లిం రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని మోడీ ఎందుకు చెపుతారు? అంటే ఆనాడు కేసీఆర్‌ అబద్దం చెప్పారని అర్ధమవుతోంది. 

ఈ విషయంలో బిజెపి వైఖరి మొదటి నుంచి స్పష్టంగానే ఉంది. కానీ ప్రధాని మోడీ ఏనాడూ దీనిపై నోరువిప్పి మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎన్నికలు వచ్చాయి కనుక. 

ముస్లిం రిజర్వేషన్లు కల్పించాలనుకొన్నామని కానీ కేంద్రం అడ్డుపడిందని మొసలి కన్నీరు కారుస్తూ తెరాస ముస్లిం ఓట్లను దండుకొనే ప్రయత్నం చేస్తుందని, అదే సమయంలో తాము ముస్లిం రిజర్వేషన్లు సమర్ధంగా అడ్డుకొన్నామని గొప్పగా చెప్పుకొని బిజెపి హిందువుల ఓట్లకు గాలం వేస్తుందని మైతెలంగాణ.కామ్ ఆనాడే చెప్పింది. 

అలాగే ఈ అంశం ఆ రెండు పార్టీలకే రాజకీయంగా ఉపయోగపడుతుంది తప్ప ముస్లింలకు ఉపయోయగపడదని కూడా ఆనాడే చెప్పడం జరిగింది. నేడు అదే జరుగుతోంది. 

తెరాస ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ బిజెపి కూడా ఇప్పుడు అదే పని చేస్తోంది. తరువాత లోక్ సభ ఎన్నికలలో కూడా బిజెపి, తెరాసలు దీనిని వాడుకోకమానవు. అంటే ఇది ముస్లింల కంటే వాటికే ఎక్కువగా ఉపయోగపడుతోందని అర్ధమవుతోంది. 

అయితే ఆ రెండు పార్టీలు ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించి ఉండి ఉంటే అవి ఈ అంశంపై మళ్ళీ ఈవిధంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయవు. 

ఈరోజు ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోడీ ఇతర అంశాలపై మాట్లాడినప్పుడు చాలా హుషారుగా స్పందించిన ప్రజలు, ముస్లింల రిజర్వేషన్ల అంశం గురించి మాట్లాడినప్పుడు ఎవరూ స్పందించలేదు. అంటే సున్నితమైన ఈ అంశంపై రాజకీయం చేయడాన్ని హిందూ, ముస్లింలు ఎవరూ ఆమోదించడంలేదని అర్ధం అవుతోంది. కనుక ఇకపై తెరాస, బిజెపిలు ఈ ప్రస్తావన చేయకుండా ఉంటే వాటికే మంచిది.


Related Post