తెరాస గెలిస్తే ఏమవుతుంది...ఓడితే ఏమవుతుంది?

December 03, 2018


img

సిఎం కేసీఆర్‌ చెపుతున్నట్లుగా తెరాస 100కు పైగా సీట్లతో లేదా బొటాబొటి సీట్లతో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమవుతుంది? ఒకవేళ ఎన్నికలలో ఓడిపోతే ఏమవుతుంది? అని అప్పుడే చాలా మంది ఆలోచిస్తున్నారు. 

ఈ ఎన్నికలు తెరాసకు ముఖ్యంగా సిఎం కేసీఆర్‌కు కొన్ని కొత్త పాఠాలు నేర్పాయని చెప్పక తప్పదు. అయినప్పటికీ తెరాస భారీ మెజార్టీతో గెలిస్తే దాని తీరు ఒకవిధంగా, బొటాబొటి  సీట్లతో గెలిస్తే మరొక విధంగా ఉండే అవకాశం ఉంటుంది. 

ఒకవేళ తెరాస (ఎన్ని సీట్లతో గెలిచినా) మళ్ళీ అధికారంలోకి వస్తే, ముందుగా రాష్ట్రంలో కాంగ్రెస్‌, టిడిపిలతో సహా భవిష్యత్తులో తనకు సవాలు విసరగలరనుకొన్న ప్రతీపార్టీని, రాజకీయ నాయకుడిని మళ్ళీ తలెత్తకుండా ‘సవరించడం’ ఖాయం. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరామ్‌, మందకృష్ణ మాదిగ తదితరులపై ప్రతీకారం తీర్చుకొనే ప్రయత్నాలు చేయవచ్చు. కనుక ఈ ఎన్నికలలో ప్రజాకూటమి ఓడిపోతే వారందరూ తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసిరావచ్చు. 

అదేవిధంగా తెరాస అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ యధాతధంగా కొనసాగిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. 

ఇక 100కు పైగా సీట్లను గెలుచుకొంటే తెరాసలో కనిపించే అహంభావం, నిరంకుశత్వ లక్షణాలు మరింత పెరగవచ్చు. రాష్ట్రంలో తన పాలనకు అపూర్వమైన ప్రజామోదం లభించినందున కేసీఆర్‌ అప్పుడు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పే ప్రయత్నం చేయవచ్చు. 

అదే...బొటాబొటి సీట్లతో గెలిస్తే, తమ ఈ పరిస్థితికి ప్రధాన కారణమైన అవలక్షణాలను వదిలించుకోవడానికి కొంచెం ప్రయత్నించవచ్చు. అలాగే మళ్ళీ ఎన్నడూ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలు చేయకపోవచ్చు. ఈ ఎన్నికలలో తనకు నష్టం లేదా ఇబ్బంది కలిగించినవాటిని సరిదిద్దుకొనే ప్రయత్నాలు గట్టిగా చేయవచ్చు. వాటిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, ఉద్యోగాల భర్తీ వేగవంతం చేయడం, మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించడం, శాసనసభ లోపల బయట ప్రతిపక్ష పార్టీలను కలుపుకుపోయే ప్రయత్నాలు చేయడం, ధర్నా చౌక్ పై నిషేధం ఎత్తివేయడం వంటి కొన్ని చర్యలు చేపట్టి మసకబారిన తన ప్రతిష్టను మళ్ళీ పునరుద్దరించుకొనే ప్రయత్నాలు చేయవచ్చు. 

అదే తెరాస ఓడిపోతే, అప్పుడు కాంగ్రెస్‌ కూడా గతంలో కేసీఆర్‌ చేసినట్లే తెరాసలో ఫిరాయింపులను ప్రోత్సహించి ఆ పార్టీని పూర్తిగా విచ్చినం చేయడానికి గట్టిగా ప్రయత్నించవచ్చు. అలాగే కేసీఆర్‌పై పగతో రగిలిపోతున్న రేవంత్‌రెడ్డి, ఆనాడు శపధం చేసినట్లు ఆయనను జైలుకు పంపించడానికి గట్టి ప్రయత్నాలు చేయవచ్చు. ఇక కేసీఆర్‌ కుటుంబ సభ్యులపై అవినీతి కేసులు నమోదయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కేటిఆర్‌ మాటకు కట్టుబడితే రాజకీయ సన్యాసం చేస్తారు లేకుంటే ప్రతిపక్షనాయకుడిగా ప్రజాకూటమి ప్రభుత్వంతో శాసనసభలోపల బయటా పోరాటాలు కొనసాగించవచ్చు. షరా మామూలుగా సోనియా, రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో “రాష్ట్రాభివృద్ధి కోసం” పనిచేయడానికి కొందరు తెరాస ఎమ్మెల్యేలు, నేతలు ప్రజాకూటమిలోకి ఫిరాయించవచ్చు. ప్రజాకూటమి అధికారంలోకి రాగానే ధర్నా చౌక్ పై నిషేధం ఎత్తివేస్తామని ప్రకటించింది కనుక తెరాస నేతలు అక్కడే దీక్షలు, ధర్నాలు చేయడం ప్రారంభించి ప్రజాకూటమి ప్రభుత్వం చెవిలో జోరీగలాగ ఇబ్బంది పెట్టవచ్చు.


Related Post