తెరాస, ప్రజాకూటమి మద్య ఓట్లు చీలితే?

December 03, 2018


img

ఈసారి ఎన్నికలలో ఎటువంటి గందరగోళం, అయోమయం లేదని రాష్ట్రాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి రేయింబవళ్లు కృషిచేస్తున్న తెరాసను ఎన్నుకోవడమే సరైన నిర్ణయమని, ప్రజలు కూడా తెరాసకే 100కు పైగా సీట్లతో మళ్ళీ అధికారం కట్టబెట్టబోతున్నారని సిఎం కేసీఆర్‌ నమ్మకంగా చెపుతున్నారు. ప్రజాకూటమి రంగంలో దిగక మునుపు సిఎం కేసీఆర్‌ చెప్పినట్లుగానే రాష్ట్రంలో తెరాసకు పూర్తి అనుకూల వాతావరణమే కనిపించేది. కానీ ఒకపక్క కాంగ్రెస్‌, టిడిపి, బిజెపి అధినేతలు, అగ్రనేతలు మరోపక్క కోదండరామ్‌, మందకృష్ణ మాదిగ, గద్దర్ వంటి నేతలు కేసీఆర్‌ పాలనపై చేస్తున్న నిశిత విమర్శలు, ఆరోపణలు ప్రజలను ఆలోచింపజేయకమానవు. కనుక తెరాస, ప్రజాకూటమి నేతలు చేస్తున్న పూర్తి భిన్నమైన ఈ వాదనల కారణంగా ప్రజలలో కొంత అయోమయ పరిస్థితి ఏర్పడటం సహజమే. ఈ రెండు రకాల వాదనల కారణంగా ప్రజలు తెరాస, ప్రజాకూటమి మద్య చీలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. 

కనుక వాస్తవిక దృష్టితో చూసినట్లయితే ప్రస్తుత పరిస్థితులలో సిఎం కేసీఆర్‌ చెపుతున్నట్లుగా తెరాస 100కు పైగా సీట్లు గెలుచుకోవడం అసంభవమేనని చెప్పవచ్చు. బహుశః అందుకే మంత్రి హరీష్ రావు నిన్న ఆ సంఖ్యను 90కు తగ్గించి చెప్పారనుకోవచ్చు. 

ఇక కేసీఆర్‌, కేటిఆర్‌, తదితరుల మాటల్లో కనిపిస్తున్న ఆవేశం, ఆగ్రహం చూస్తే వాటి వెనుక అభద్రతాభావం కూడా కనిపిస్తోంది. అంటే 100 సీట్లు రాకపోవచ్చునని వారు కూడా గ్రహించి ఉండవచ్చు. కానీ గత నాలుగేళ్లలో తెరాస పాలన ఎంత నిరంకుశంగా, అప్రజాస్వామికంగా సాగినప్పటికీ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కళ్ళకు కనబడుతున్నాయి కనుక ప్రజలు రెండు రకాల వాదనల మద్య ఎంతగా చీలిపోయినప్పటికీ తెరాసకు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడినన్ని స్థానాలైనా లబించే అవకాశాలున్నాయి.


Related Post