ఎన్నికల సంఘం విశ్వసనీయతకు పరీక్ష: తెలంగాణ ఎన్నికలు

December 03, 2018


img

ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా అవి ఎన్నికల సంఘానికి అగ్నిపరీక్ష వంటివేనని చెప్పవచ్చు. ఒకపక్క అధికార పార్టీల నుంచి తీవ్ర ఒత్తిళ్ళు, ఆ ఒత్తిళ్లకు తలొగ్గి ఎన్నికల సంఘం అధికార పార్టీ ఏజంట్ లాగ వ్యవహరిస్తోందని ప్రతిపక్షపార్టీల ఆరోపణల మధ్య నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడం కత్తిమీద సామువంటిదేనని చెప్పవచ్చు. కనుక ప్రతీ ఎన్నికలూ కేంద్ర ఎన్నికల కమీషన్, రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాల విశ్వసనీయతకు ఒక అగ్ని పరీక్షవంటివేనని చెప్పక తప్పదు.

ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రజాకూటమికి, తెరాసలకు జీవన్మరణ సమస్యవంటివి కావడంతో గెలుపుకోసం అవి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. కనుక ఈసారి ఎన్నికలలో మరికాస్త ఎక్కువ వేడి కనిపిస్తోంది.    

శనివారం రాత్రి కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి అనుచరుల ఇళ్ళలో పోలీసులు సోదాలు నిర్వహించడానికి వచ్చినప్పుడు వారితో రేవంత్‌రెడ్డి అనుచరులు వాగ్వాదం చేశారు. ఈ సంగతి తెలుసుకొన్న రేవంత్‌రెడ్డి హుటాహుటిన అక్కడకు చేరుకొని తన అనుచరులతో కలిసి రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. ఎటువంటి వారెంటు లేకుండా పోలీసులు సోదాల పేరుతో తన అనుచరుల ఇళ్లలోకి అర్దరాత్రి జొరబడటాన్ని రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. తన అనుచరులను భయబ్రాంతులను చేసేందుకే పోలీసులు ఆవిధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వారి తీరుకు నిరసనగా రేవంత్‌రెడ్డి రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. 

అయితే తెరాస నేతలు ఈ పోలీసుల సోదాల గురించి ప్రస్తావించకుండా రేవంత్‌రెడ్డి, అనుచరులు రోడ్లపై బైటాయించి ప్రజలను భయబ్రాంతులను చేస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే రేపు కొడంగల్‌లో సిఎం కేసీఆర్‌ నిర్వహించబోయే సభను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారని వారు ఫిర్యాదు చేశారు. వారి పిర్యాదుపై వెంటనే స్పందించిన ఎన్నికల సంఘం ఈ ఘటనలపై రాష్ట్ర డిజిపి  వివరణ కోరింది.  

సిఎం కేసీఆర్‌ సభను అడ్డుకొంటామని రేవంత్‌రెడ్డి చెప్పిన మాట వాస్తవం. ఆయన ఆవిధంగా చెప్పడం తప్పే కనుక ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. అయితే ప్రజాకూటమి నేతలు గ్రామాలలోకి వస్తే వారిని తరిమితరిమికొట్టాలని తెరాస మంత్రులు, నేతలు కూడా ప్రజలను రెచ్చగొడుతున్నారు. మరి అది కూడా తప్పే కదా? 

తెరాస పిర్యాదుపై వెంటనే స్పందిస్తున్న ఈసీ, సోదాల పేరుతో పోలీసులు తమను వేధిస్తున్నారంటూ వంటేరు ప్రతాప్ రెడ్డి తదితర ప్రతిపక్షపార్టీల అభ్యర్ధుల పిర్యాదులను పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గజ్వేల్ ఎన్నికల అధికారులు తన పిర్యాదును పట్టించుకోకపోవడంతో ఆయన వారి కార్యాలయం ముందే నిరాహార దీక్షకు కూర్చొన్న సంగతి అందరికీ తెలిసిందే.

అలాగే కొడంగల్‌ తెరాస అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి, బందువుల ఇళ్ళలో ఐ‌టి సోదాలు జరిగినప్పుడు పట్టుబడిన నగదు, రసీదుల వివరాలను బహిర్గతం చేసి, ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్న రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిని ఎన్నికల సంఘం పట్టించుకోలేదు.

కనుక రాష్ట్ర ఎన్నికల సంఘం, అలాగే రాష్ట్ర పోలీసులు, ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న అధికారులు అందరూ  నిష్పక్షపాతంగా, పారదర్శంగా వ్యవహరిస్తూ తన విశ్వసనీయతను నిలుపుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.


Related Post