బిజెపి చెపుతున్న అభివృద్ధి ఇదేనా?

December 02, 2018


img

కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఆదివారం హైదరాబాద్‌ నగరంలో పలుప్రాంతాలలో బిజెపి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటునారు. ఉప్పల్ రింగ్‌రోడ్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ, “మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో దూసుకుపోతోంది. రాష్ట్రంలో బిజెపిని గెలిపించి అధికారం ఇస్తే తెలంగాణను కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాము. కాంగ్రెస్‌, టిడిపి, తెరాసలు మూడూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలవంటివి. వాటికి అధికారం అప్పజెప్పితే కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. ఒక్క బిజెపి మాత్రమే ప్రజల కోసం పనిచేస్తోంది. తెలంగాణలో తెరాస అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.50,000 కోట్లు మంజూరు చేసిందంటే తెలంగాణ రాష్ట్రాభివృద్ధి పట్ల మా నిబద్దతను అర్ధం చేసుకోవచ్చు. కనుక ఈసారి ఎన్నికలలో బిజెపిని గెలిపించి రాష్ట్రాభివృద్ధికి అందరూ సహకరించండి,” అని కోరారు. 

బిజెపి పాలిత రాష్ట్రాలలో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నీమచ్ జిల్లాలో ఆదివారం కిలో ఉల్లి ధర 50 పైసలకు పడిపోవడంతో ఉల్లి రైతులు తీవ్ర ఆగ్రహంతో...ఆవేదనతో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డువద్ద రోడ్లపై ఉల్లిపాయలు పారబోసి నిరసనలు తెలుపుతున్నారు. 



ఇక బిజెపి పాలిత యూపీలోని ఘోరక్ పూర్ లోని బి.ఆర్.డి.మెడికల్ కాలేజీలో  ఆక్సిజన్ లేకపోవడంతో ఆగస్ట్ 2018లో  సుమారు 60 మందికి పైగా పసిపిల్లలు చనిపోయారు. యూపీలోని ఫరూఖాబాధ్ ప్రభుత్వాసుపత్రిలో కూడా అదేకారణంతో సెప్టెంబరు నెలలో 20 మండి పసిపిల్లలు చనిపోయారు. కారణం ఏమిటో తెలుసా? ఆక్సిజన్ సరఫరా చేసే సంస్థకు ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడమే! దీనిని బట్టి ఆ రాష్ట్రంలో బిజెపి పాలన ఏవిధంగా సాగుతోందో అర్ధం చేసుకోవచ్చు. 



అలాగే డిల్లీలో గజగజ వణికించే చలిలో సుమారు 1,000 మంది తమిళనాడు రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని, పంట రుణాలు ఇవ్వాలని కోరుతూ గతవారం రోజులుగా రామ్ లీలా మైదానంలో అర్ధనగ్నంగా నిరసన దీక్షలు చేస్తున్నారు. ఆరు నెలల క్రితం ఓసారి వారు డిల్లీ వచ్చినప్పుడు చాలా దిగ్బ్రాంతికరమైనవిదంగా తమ నిరసనలు తెలిపారు. తమతమ ప్రాంతాలలో అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకొన్న తమ సాటి రైతుల పుర్రెలు, ఎముకలు ముందుపెట్టుకొని నిరసనలు తెలిపారు.


సుమారు నాలుగు వారాలు వారు డిల్లీలో నిరసన దీక్షలు చేసినా కేంద్ర ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. కనుక వారందరూ మళ్ళీ డిల్లీ వచ్చి ప్రస్తుతం రామ్ లీలా మైదానంలో వారం రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నారు. కానీ ఇప్పుడూ డిల్లీలో వారి మొర వినే నాధుడు లేడు. 

రైతుల ఆత్మహత్యలలో బిజెపి, శివసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.


ఇదేనా బిజెపి చెపుతున్న అభివృద్ధి, రైతు సంక్షేమం? తెలంగాణలో కూడా అటువంటి గొప్ప పాలన అందిస్తామని నితిన్ గడ్కారీ చెపుతున్నారు. కనుక కావాలో వద్దో ప్రజలే నిర్ణయించుకోవాలి.


Related Post