కేటిఆర్‌ నోట అటువంటి మాట...వెరీ బ్యాడ్!

December 02, 2018


img

తెలంగాణలో ఎన్నికల గంట కొట్టినప్పటి నుంచి తెరాస ఒక్క చంద్రబాబు నాయుడునే లక్ష్యంగా చేసుకొని ఎన్నికల వ్యూహం రూపొందించుకోవడమే ఆశ్చర్యకరమనుకొంటే, తెలంగాణలో బాబు అడుగుపెడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేలు పెడతామని కేటిఆర్‌ బెదిరింపులకు పాల్పడటం ఇంకా విడ్డూరంగా ఉంది. అది తెరాస అధినేతలలో నెలకొన్న ఫ్యూడలిజం, అభద్రతాభావాలకు అద్దం పడుతోంది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ కు చెందిన బిఎస్పీ, డిల్లీకి చెందిన ఆమాద్మీ పార్టీ, జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బిజెపి, సిపిఐ, సిపిఎం, టిడిపి పార్టీలు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. కానీ వాటిలో ‘టిటిడిపి’తో సహా వేటినీ  పట్టించుకోని తెరాస అధిష్టానం చంద్రబాబును చూసి ఎందుకు ఇంత తీవ్రంగా స్పందిస్తోందంటే రెండు కారణాలు కనిపిస్తునానాయి. 

1. తెలంగాణ ప్రజలకు ఆయనను బూచిగా చూపిస్తూ వారిలో తెలంగాణ సెంటిమెంటు రగిలించి ఎన్నికలలో గెలవాలనే ఉద్దేశ్యంతో కావచ్చు. 

2. ఈ ఎన్నికల కోసమే నాలుగేళ్ళు కష్టపడి ఒక పద్దతి ప్రకారం రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలన్నిటినీ నిర్వీర్యం చేసి, 9 నెలల ముందుగా తమ ప్రభుత్వాన్ని, అధికారాన్ని కూడా త్యాగం చేస్తే, చంద్రబాబు తమ  విజయావకాశాలను ఎక్కడ తారుమారుచేస్తారనే ఆందోళన కారణం కావచ్చు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేలుపెట్టడం అంటే ఆ రాష్ట్రానికి తెరాసను విస్తరిస్తామని అర్ధం కాదు. విస్తరిస్తామని కేటిఆర్‌ అని ఉంటే చంద్రబాబు కూడా స్వాగతించవలసి వచ్చేది. కానీ వేలు పెట్టడం అంటే బాబు రాజకీయ శత్రువులతో చేతులు కలిపి ఆయనకు ఇబ్బందులు సృష్టిస్తామని కేటిఆర్‌ హెచ్చరిస్తున్నట్లు భావించవచ్చు. 

మా రాష్ట్రంలో మేము తప్ప మరే పార్టీ ఉండకూడదు. ఇక్కడ మా మాటే శాసనం. ఇక్కడ మమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే మీడియానైనా, ప్రతిపక్షపార్టీలనైనా ఉక్కుపాదంతో అణచివేస్తాం. ఇక్కడ మరే పార్టీ పోటీ చేయకూడదు. పోటీ చేస్తే వారిని ‘రాజకీయంగా అంతు చూస్తాం’ వంటి మాటలు రాజరిక వ్యవస్థలలో చెల్లుబాటు అవుతాయి కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పుగా భావించబడతాయి. కనుక కేటిఆర్‌ ఆవిదంగా మాట్లాడటం సరికాదు. 

చంద్రబాబు నాయుడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు... పరాయివ్యక్తి కనుక ఆయనతో ఆవిధంగా వ్యవహరించడాన్ని తెరాస సమర్ధించుకొన్నా, స్థానికులైన కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులతో కూడా తెరాస ఇంచుమించు ఇదేవిధంగా వ్యవహరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

ఇది రాజారిక పోకడగా చెప్పవచ్చు. తెరాసలో నెలకొన్న ఈ అహంభావం, నిరంకుశత్వం, దొరతనం, అప్రజాస్వామిక విధానాల కారణంగానే ప్రజాకూటమి ఏర్పడింది. గత నాలుగేళ్లలో తెరాస ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ ఆ అవలక్షణాల కారణంగానే ప్రజలలో కూడా దాని పట్ల కొంత వ్యతిరేకత ఏర్పడింది. కనుక ఇది తెరాస స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు. అయితే అది ఆ అవలక్షణాలను గుర్తించి సరిదిద్దుకొనే ప్రయత్నం చేయకుండా మరో అడుగు ముందుకు వేసి ఈవిధంగా బెదిరింపులకు పాల్పడటం చాలా శోచనీయం. తెరాసది అహంభావమా లేక ఆత్మవిశ్వాసమా అనేది అతిత్వరలోనే రాష్ట్ర ప్రజలే తేల్చబోతున్నారు.


Related Post