అప్పుడు జగన్...ఇప్పుడు కేసీఆర్‌!

December 01, 2018


img

సమైక్య రాష్ట్రంలో చివరి ఎన్నికలు జరుగుతునప్పుడు రాష్ట్రవిభజన ప్రక్రియ దాదాపు పూర్తవుతోంది. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు విడిపోవడం అనివార్యమని పసిగట్టిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో వైకాపా దుఖాణం బంద్ చేసేసి ఏ‌పికి ఎగిరివెళ్ళిపోయి సమైక్య శంఖారావం పూరించడం బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఆయన పదేపదే ఒక మాట చెప్పేవాడు. “నాకు 175 మంది ఎమ్మెల్యేలను, 25మంది ఎంపిలను ఇవ్వండి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వారి మెడలు వంచి రాష్ట్ర విభజన జరుగకుండా అడ్డుకొంటాను,” అని గట్టిగా చెప్పేవారు. అయితే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి 25 ఎంపీ సీట్లు ఇస్తే మళ్ళీ రెండు రాష్ట్రాలను కలపడం ఏవిధంగా సాధ్యమో జగన్ ఏనాడూ చెప్పలేదు. ప్రజలు కూడా అడగలేదు కానీ ఆయనను ఎన్నికలలో రిజక్ట్ చేశారు. 

ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలలో కేసీఆర్‌ కూడా తనకు 17 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి (ముస్లింలకు రిజర్వేషన్లు, బయ్యారం స్టీల్ ప్లాంట్ వగైరా) అన్నీ సాధిస్తానని గట్టిగా చెపుతున్నారు. ఆ 17 మంది ఎంపీలతో డిల్లీలో చక్రం తిప్పుతానని, కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని, హైదరాబాద్‌ కేంద్రంగా దేశరాజకీయాలను శాసిస్తానని  చెపుతున్నారు. ఆయన కూడా అది ఏవిధంగా సాధ్యమో  వివరించడం లేదు. కానీ డిల్లీలో చక్రం తిప్పడం పక్కా అంటున్నారు. 

ఆనాడు జగన్ ‘డిల్లీలో చక్రం తిప్పుతాను..కేంద్రం మెడలు వంచుతాను’ అంటే ఏపీ ప్రజలు నమ్మలేదు. మరి కేసీఆర్‌ మెడలు వంచుడు...చక్రం తిప్పుడు మాటలను తెలంగాణ ప్రజలు నమ్ముతారో లేదో తెలియాలంటే డిసెంబరు 11వరకు వేచి చూడాల్సిందే.


Related Post