బాబుకు అంత ధైర్యం ఎలా వచ్చింది?

December 01, 2018


img

ఏపీ సిఎం చంద్రబాబునాయుడు మళ్ళీ ఇవాళ్ళ కూడా హైదరాబాద్‌ నగరంలో టిడిపి అభ్యర్ధుల తరపున రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు తన గొప్పదనం చెప్పుకోంటూ, మరోవైపు సిఎం కేసీఆర్‌ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. ఆయన రోడ్ షోలో ఏమి చెపుతారో తేలికగానే ఊహించుకోవచ్చు కనుక ఇప్పుడు ఆ చర్చ  అనవసరం. 

నిన్న మొన్నటి వరకు కేసీఆర్‌ ఎన్ని తిట్లు తిట్టినా మౌనంగా ఉండిపోయిన చంద్రబాబు హటాత్తుగా ఎదురుదాడి చేస్తున్నారు. హైదరాబాద్‌ నడిబొడ్డున నిలబడి కేసీఆర్‌ను వేలెత్తి చూపి విమర్శిస్తున్నారు. ఆయనలో ఈ మార్పు చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆయనకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది?అని అందరూ ఆలోచిస్తున్నారు. బాబుకి ఇంత ధైర్యం కలగడానికి మూడు కారణాలు కనిపిస్తున్నాయి. 

1. కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేయడం వలన ఆ పార్టీ నేతల అండదండలు లభిస్తుండటం. 

2. ప్రజాకూటమి చేతిలో తెరాస ఓటమి ఖాయమనే నమ్మకం కలగడం. 

3. ఒకవేళ తెలంగాణలో ప్రజాకూటమి గెలవలేకపోయినా, వచ్చే లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ నేతృత్వంలో కూటమి గెలుపు ఖాయం అని నమ్ముతున్నందున కావచ్చు. 

ఒకవేళ రాష్ట్రంలో ప్రజాకూటమి స్వల్ప మెజార్టీతోనైనా రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగితే, ప్రభుత్వంలో రేవంత్‌రెడ్డి  కీలకపాత్ర పోషించడం ఖాయం అని వేరే చెప్పనవసరం లేదు. ‘ఎప్పటికైనా కేసీఆర్‌ను గద్దె దించి జైల్లో చిప్పకూడు తినిపించకపోతే నా పేరు రేవంత్‌రెడ్డి కాదని’ ఆనాడు శపధం చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. కనుక ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతున్న చంద్రబాబు అందుకే కేసీఆర్‌పై ఇంతగా రెచ్చిపోయి విమర్శలు చేస్తున్నారని భావించవచ్చు. 

ఇక తెలంగాణలో చేసిన ఈ కూటమి ప్రయత్నాలు విఫలం అయినప్పటికీ వెంటనే లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. కనుక కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే దేశంలో అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నారు. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగలిగినా దాని ద్వారా కేసీఆర్‌ను కట్టడి చేయవచ్చునని చంద్రబాబు భావిస్తున్నట్లున్నారు. బహుశః అందుకే ఆయన ఈసారి ఇంతగా రెచ్చిపోయి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారనుకోవచ్చు. అయితే ఆయన అంచనాలు నిజమవుతాయో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.


Related Post