చేతికి అందివచ్చిన కొడుకులాంటివాడు: హరీష్

December 01, 2018


img

మంత్రి హరీష్ రావు శనివారం ఎల్లారెడ్డి తెరాస అభ్యర్ధి రవీందర్ రెడ్డి తరపున  ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజలను ఆకట్టుకొనేవిధంగా మాట్లాడటంలో హరీష్ రావు మంచి నేర్పరని అందరికీ తెలిసిందే. ప్రజలను ఉద్దేశ్యించి ఆయన మాట్లాడిన మాటలు వింటే అందరూ అవునని అంగీకరించక తప్పదు. 

“రవీందర్ రెడ్డికి మంచి భవిష్యత్ ఉందని, పెద్ద నాయకుడు అవుతాడని మన ముఖ్యమంత్రి కేసీఆరే కితాబు ఇచ్చారు. కనుక రవీందర్ రెడ్డి గెలిస్తే ఎవరికి లాభం? ఇక్కడికి ప్రజలకే కదా? చేతికి అందివచ్చిన కొడుకులాంటివాడు మన రవీందర్ రెడ్డి. ఏ తల్లి తండ్రీ అయిన కొడుకు అందివచ్చడంటే ఏవిధంగా సంతోషిస్తారో, మీరు కూడా అలాగే సంతోషిస్తారని నాకు తెలుసు. రవీందర్ రెడ్డి తెలంగాణ కోసం పోరాడి లాఠీ దెబ్బలు తిన్న ఉద్యమకారుడు. మీ అందరి దీవెనల ఈస్థాయికి ఎదిగిన ఆయనను జిల్లాలో మిగిలిన వారందరి కంటే అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన పట్ల మీకెంత అభిమానం ఉందో తెలియజేయాలని మీ అందరినీ కోరుతున్నాను. 

నిన్న ప్రజాకూటమి సభలో కోదండరామ్‌ మాట్లాడుతూ మన కేసీఆర్‌ ‘గాయపడిన బ్యాట్స్ మ్యాన్’ వంటివాడని అన్నారు. ఎవరు గాయపడ్డ బ్యాట్స్ మేనో మరో 10 రోజులలో తేలిపోతుంది. డిసెంబరు 11వ తేదీన కోదండరామ్‌ తన ఇంట్లో టీవీ ముందు కూర్చొని మన సిఎం కేసీఆర్‌ సిక్సర్లు కొడుతుంటే చప్పట్లు కొట్టక తప్పదు. ప్రజాకూటమిలో అందరూ కలిసి ఆయన చెట్టెక్కించేసి కూర్చోబెట్టారు. ఆయన అక్కడి నుంచి క్రిందకు దిగలేరు. దిగాలని ప్రయత్నించినా కాంగ్రెస్‌ నేతలు ఆయనను క్రిందకు దిగనీయరు. ఇక ఆయన ఎప్పటికీ ఆ చెట్టుపైనే ఉండిపోవాలి. ఇదీ ఆయన పరిస్థితి. అటువంటి ఆయన కూడా కేసీఆర్‌పై కామెంట్స్ చేస్తుంటారు. 

ముస్లింలు, కాయిత లంబాడీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్‌ మాట ఇచ్చారంటే దానిని తప్పకుండా నిలబెట్టుకొంటారు. రానున్న రోజులలో కేంద్రంలో చక్రం తిప్పేది మనమే. అప్పుడు మనకు ఏది కావాలనుకొంటే అది సాధించుకోగలుగుతాము. కనుక కేసీఆర్‌ నాయకత్వాన్ని అందరూ బలపరచడానికి తెరాస అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించుకోవలసిన అవసరం ఉంది.

రాష్ట్రంలో మళ్ళీ మనమే అధికారంలోకి రావడం ఖాయం కానీ ఈనాలుగు రోజులలోగా కాంగ్రెసోళ్ళు మాయ మాటలు చెప్పడానికి మీ దగ్గరకు వస్తారు. కనుక మీరెవరూ వారి మాయలో పడకుండా మన రవీందర్ రెడ్డినే భారీ మెజార్టీతో గెలిపించాలి. 

గాంధారి మండలాన్ని దత్తత తీసుకోమని మీరు అడిగితే నేను కాదనగలనా? తప్పకుండా దత్తత తీసుకొని 15 కోట్లు కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. నాకోసం ఎంతో అభిమానంతో వచ్చిన మీ అందరినీ చూస్తుంటే నా కడుపు నిండిపోయింది. మీతో మాట్లాడుతూ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. ముందుకు వెళ్ళాలనిపించడంలేదు కానీ నేను ఇంకా చాలా చోట్ల సభలకు వెళ్ళాలి కనుక మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళక తప్పడం లేదు,” అని హరీష్ రావు అన్నారు.


Related Post