తెరాసకు శత్రుశేషం...రుణశేషం

December 01, 2018


img

శత్రుశేషం...రుణశేషం ఉంచకూడదంటారు పెద్దలు. ఉంచితే ఏదోనాడు వాటికి మూల్యం చెల్లించవలసి రావచ్చునని దానార్ధంగా చెప్పుకోవచ్చు. తెరాస ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటోందని చెప్పవచ్చు. 

ముందుగా శత్రుశేషం గురించి చెప్పుకొంటే, కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన రెండవపని అదే. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తెరాసలోకి ఆకర్షించి వాటిని దాదాపు నిర్వీర్యం చేశారు. తనకు గట్టి సవాలు విసురుతున్న చంద్రబాబునాయుడును, రేవంత్‌రెడ్డిని ఓటుకు నోటు కేసుతో కట్టడి చేయగలిగారు. కనుక రాష్ట్రంలో ఇక తెరాసను ఎదిరించగలవారు లేరని కేసీఆర్‌ భావించారు. 

కానీ ఊహించని విధంగా కాంగ్రెస్‌ పార్టీ నిలద్రొక్కుకొంది. దాని నేతృత్వంలో తెరాస శత్రువులు అందరూ ఒక్కటయ్యారు. వారందరూ కలిసి తెరాసకు ఇపుడు గట్టి సవాలు విసురుతున్నారు. ఈ ఎన్నికల కోసం మూడేళ్ళ క్రితం నుంచే సన్నాహాలు ప్రారంభించిన సిఎం కేసీఆర్‌ మరి శత్రుశేషం ఎందుకు ఉంచుకొన్నారో తెలియదు కానీ ఇప్పుడు దానికి మూల్యం చెల్లించవలసి వస్తోంది. ఈసంగతి సిఎం కెసిఆర్ కూడా ఇప్పుడు గ్రహించినట్లే ఉన్నారు. అందుకే ఈసారి అధికారంలోకి వస్తే ఎవరినీ ఉపేక్షించబోనని గట్టిగా చెపుతున్నారు.  

ఇక రుణశేషం గురించి మాట్లాడుకొంటే, పంటరుణాల మాఫీ గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది. మంచిర్యాలలో నిన్న జరిగిన ప్రజాకూటమి సభలో టిజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌ మాట్లాడుతూ, “కేసీఆర్‌ పంట రుణాలు మొత్తం మాఫీ చేశానంటాడు. కానీ రైతులేమో మా రుణాలు తీరనే లేదంటున్నారు. కనుక పంటరుణాల మాఫీ ఎవరికీ అర్ధం కాని ఒక మాయగా మిగిలిపోయింది,” అని అన్నారు. 

ఇది చాలా ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే, లక్ష రూపాయల పంట రుణాలను కేసీఆర్‌ ప్రభుత్వం 4 వాయిదాలలో తీర్చిన మాట వాస్తవం. కానీ లక్ష రూపాయల రుణంలో ప్రభుత్వం ఒక వాయిదా చెల్లిస్తే, అప్పటికే పేరుకు పోయిన వడ్డీతో పాటు మిగిలిన 75,000 అసలుపై మళ్ళీ వడ్డీ పడింది. దాంతో ప్రభుత్వం చెల్లిస్తున్న ఆ వాయిదాలు ఆ వడ్డీలకే సరిపోయేది. ప్రభుత్వం బ్యాంకులకు లక్ష రూపాయలు చెల్లించినా, నేటికీ చాలామంది రైతుల ఆ అప్పు పూర్తిగా తీరనే లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండవ విడత రైతుబందు చెక్కులను కొన్ని బ్యాంకులు ఆ పాతబాకీ, వడ్డీలో జమా చేసుకొన్నాయి. అంటే పంట రుణమాఫీ అసలు ప్రయోజనం నెరవేరలేదని అర్ధం అవుతోంది. ఈ అప్పులు, వడ్డీల బాధలు భరించలేక కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా బ్రతికి ఉన్నవారు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అంటే తెరాస పని ‘ఆపరేషన్ సక్సస్ బట్ పేషెంట్ ఈజ్ డెడ్’ అన్నట్లయిందని చెప్పవచ్చు. రైతులలో ఉన్న ఈ ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా మలుచుకొనేందుకే ప్రజాకూటమి తాము అధికారంలోకి వస్తే ఒకేసారి రైతులకు రూ.2 లక్షల రుణం తీరుస్తామని ప్రకటించి వారిని ఆకట్టుకోగలుగుతోంది. ఇదే రుణ శేషం. దీనికి కూడా తెరాస ఇప్పుడు మూల్యం చెల్లించవలసి వస్తోంది.


Related Post