లగడపాటి చెప్పింది నిజమే కానీ...జితేందర్ రెడ్డి

December 01, 2018


img

లగడపాటి రాజగోపాల్ రాజకీయాలలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఒక సంచలనమే. రాష్ట్ర విభజన తరువాత మాట ప్రకారం రాజకీయ సన్యాసం చేసినా ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా సంచలనమే. ఇదే మరోసారి నిరూపితమైంది. 

ఈసారి ఎన్నికలలో 8-10 మంది స్వతంత్ర అభ్యర్ధులు గెలవబోతున్నారంటూ ఆయన నిన్న ఒక బాంబు పేల్చారు. దానిపై అప్పుడే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ముఖ్యంగా 103-108 సీట్లు గెలుచుకోబోతున్నామని నొక్కి చెపుతున్న తెరాసలో ఈ ప్రకంపనలు మొదలయ్యాయి. లగడపాటి జోస్యంపై సిఎం కేసీఆర్‌ తీవ్రఆగ్రహంతో ఊగిపోయీ తనలో అభద్రతాభావాన్ని బయటపెట్టుకోగా తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి మాత్రం లగడపాటి జోస్యాన్ని చాలా సానుకూల దృక్పదంతో తమకు అనుకూలంగా అన్వయించుకొని చెప్పడం అభినందనీయం.           

దీనిపై జితేందర్ రెడ్డి స్పందిస్తూ, “119 స్థానాలలో 10 మంది స్వతంత్ర అభ్యర్ధులు గెలుస్తారంటే అర్ధమేమిటి? మేము చెపుతున్నట్లు 100-105 మంది తెరాస ఎమ్మెల్యేలు గెలువబోతున్నారనే కదా అర్ధం? మిగిలినవాటిలో 7 సీట్లు మజ్లీస్ పార్టీ గెలుచుకొంటుంది. అంటే ప్రజాకూటమి, బిజెపి తదితర అన్ని పార్టీలకు కలిపి 4-5 సీట్లు మాత్రమే వస్తాయని స్పష్టం అవుతోంది. తెలంగాణ ఏర్పాటును లగడపాటి ఎంతగా వ్యతిరేకించినా ఈసారి మా గెలుపు ఖాయమని ముందే చెప్పేసి ఆయన మాకు చాలా మేలే చేశారు,” అని అన్నారు. 

అయితే లగడపాటి నిన్న చెప్పినట్లు నారాయణ్ పేట నియోజకవర్గంలో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి శివకుమార్‌రెడ్డి నుంచి తమకు గట్టి పోటీ ఉందని, కానీ అతను రెండవ స్థానానికి పరిమితం కావచ్చునని జితేందర్ రెడ్డి అన్నారు. 

జితేందర్ రెడ్డి మాటలపై మళ్ళీ లగడపాటి స్పందిస్తూ, “దీనిని బట్టి నేను ఏదో నోటికి వచ్చిన పేరు చెప్పలేదని అర్ధం అవుతోంది. చాలా కాలం రాజకీయాలలో ఉన్నందున ఆ ఆసక్తితోనే తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలను నిశితంగా గమనిస్తున్నాను. ఖచ్చితమైన అంచనకు వచ్చాకనే నేను నిన్న ఆ ప్రకటన చేశాను. అయితే నేను చెప్పిన స్వతంత్ర అభ్యర్ధులు గెలుస్తారా లేక జితేందర్ రెడ్డి చెప్పినట్లు రెండవ స్థానంలో నిలుస్తారా? అనే దానితో నాకు సంబందం లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలలో ఎవరు గెలిచినా ఓడినా నాకేమీ నష్టం లేదు. డిసెంబరు 7వ తేదీన పోలింగ్ పూర్తయిన తరువాత నేను చేయించిన  సర్వే ఫలితాలు వెల్లడిస్తాను. దానిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెపుతాను,” అని అన్నారు. 

సాధారణంగా ప్రతీ ఎన్నికలలో వందలాది మంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీకి దిగుతుంటారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలలో కూడా అదే జరిగింది. అయితే ఈసారి తెరాస-ప్రజాకూటమి మద్య ఇంత తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు లగడపాటి చెప్పినట్లు 8-10 మంది స్వతంత్ర అభ్యర్ధులకు గెలిచే అవకాశాలున్న మాట నిజమైతే అది ఖచ్చితంగా ప్రజలలో తెరాస ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే అని భావించవచ్చు. లగడపాటి జోస్యాన్ని తాము సీరియస్ గానే తీసుకొని ఆ నియోజకవర్గాలలో తమ అభ్యర్ధుల గెలుపుకు మరింత గట్టిగా కృషి చేస్తామని తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి చెప్పడం చాలా హుందాగా ఉంది. 


Related Post