ఆ విషయంలో నాకూ అసంతృప్తి ఉంది: కేటిఆర్‌

December 01, 2018


img

మంత్రి కేటిఆర్‌ శుక్రవారం సిరిసిల్లజిల్లా గంభీరావుపేటలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇవ్వలేకపోయినందుకు తాను కూడా చాలా అసంతృప్తిగానే ఉన్నానని చెప్పారు. ఇళ్ళ నిర్మాణానికి భూమి దొరకకపోవడం, వీటిలో ఎక్కువ లాభం లభించదు కనుక కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, స్టీలు, సిమెంటు ధరల పెరుగుదలవంటి అనేక కారణాల చేత అనుకొన్నట్లు ఇళ్ళు కట్టించి ఇవ్వలేకపోయామని కేటిఆర్‌ చెప్పారు. 

అయితే ఇన్ని సంక్షేమ, అభివృద్ధి పనులు పూర్తిచేస్తునప్పుడు ఈ ఒక్క హామీని నెరవేర్చకుండా ఊరుకోమని, ఈసారి అధికారంలో వచ్చినపుడు తప్పకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తామని అన్నారు. తమ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొంటుందని, వారి రుణం తీర్చుకొంటుందని మంత్రి కేటిఆర్‌ అన్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొనే ఈసారి ఎవరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించుకోవడానికి తగినంత స్థలం ఉన్నట్లయితే, వారికి రూ.5 లక్షల నగదు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఏదో విధంగా రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ళు ఏర్పాటు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటిఆర్‌ అన్నారు. 

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలు ఆలస్యం అవడానికి కేటిఆర్‌ చెపుతున్న కారణాలు సహేతుకమైనవేనని అందరికీ తెలుసు. అలాగే ఇది పూర్తి మానవీయ కోణంలో ఆలోచించి తీసుకొన్న నిర్ణయమని అందరూ అంగీకరిస్తారు. కానీ ఈ విషయంలో తెరాస ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎందుకు ఎదుర్కొంటోందంటే, గత ఎన్నికలలో ఇచ్చిన ఈ హామీని నిలబెట్టుకోలేకపోయినందుకు మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇళ్ళ నిర్మాణాలు చేయడం చాలా కష్టమని తెరాస ప్రభుత్వం గ్రహించినప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ గురించి చాలా గొప్పగా ప్రచారం చేసుకొంది. దేశంలో మరే ప్రభుత్వమూ ఇటువంటి పధకం అమలుచేయలేకపోయిందని కేవలం తాము మాత్రమే అమలు చేస్తున్నామని కేటీఆర్ సైతం గొప్పలు చెప్పుకొన్నారు. తెరాస నేతలు చెపుతున్న ఇటువంటి మాటలతో పేదప్రజలలో ఆశలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చాయి. కానీ సిఎం కేసీఆర్‌ హటాత్తుగా శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు సిద్దం అవడంతో వాటి కోసం ఇన్నేళ్ళు ఆశగా ఎదురుచూసిన పేద ప్రజలకు ఇక తమకు ఇళ్ళు లభించే అవకాశం లేదని గ్రహించి తీవ్ర అసంతృప్తి చెందడం, తెరాస ప్రభుత్వం తమను మోసం చేసిందనే అభిప్రాయం ఏర్పడటం సహజం. 

ప్రజలలో ఏర్పడిన ఈ అసంతృప్తిని ప్రజాకూటమిలో పార్టీలు ఆయుధంగా మలుచుకొని తెరాసపై ప్రయోగిస్తుండటంతో తెరాస ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోక తప్పడంలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ విషయంలో తెరాస ‘అడ్వాన్స్ రాజకీయ బెనిఫిట్’ పొందితే, ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ‘బెనిఫిట్’ పొందాలని చూస్తున్నాయని చెప్పవచ్చు. కనుక దీనిని బట్టి అర్ధమవుతున్న నీతి ఏమిటంటే ఏ ప్రభుత్వమైన, ఏ పార్టీ అయినా తాము చేయని, చేయలేని పనుల గురించి ఎన్నడూ అతిగా ప్రచారం చేసుకోకూడదని! ఒకవేళ అతిగా గొప్పలు చెప్పుకొంటే చివరికి ఏమవుతుందో తెలుసుకొనేందుకు ఇదే ఒక చక్కటి ఉదాహరణ. 


Related Post