అప్పుడు అడ్డుపడ్డవాళ్ళే ఇప్పుడూ... కేసీఆర్‌

December 01, 2018


img

మాజీ కాంగ్రెస్‌ నేత లగడపాటి రాజగోపాల్ ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 8-10 మంది స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించబోతున్నారని జోస్యం చెప్పారు. వారిలో బోధ్, నారాయణ్ పేట నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్దులుగా పోటీ చేస్తున్న అనిల్‌ జాదవ్‌, శివ కుమార్ గెలవబోతున్నారని జోస్యం చెప్పారు.

లగడపాటి జోస్యంపై సిఎం కేసీఆర్‌ వెంటనే చాలా తీవ్రంగా స్పందించారు. నిన్న ప్రజా ఆశీర్వాదసభలో మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నప్పుడు కూడా కొంతమంది సన్నాసులు ఇలాగే మనకు శాపనార్ధాలు పెట్టారు. మళ్ళీ వాళ్ళే మనల్ని దెబ్బ తీసేందుకు ఇటువంటి వెకిలి,మకిలి, పిచ్చి సర్వేలు విడుదల చేస్తున్నారు. ఈ సభలకు తరలివస్తున్న వేలాదిమంది జనాలను చూస్తేనే ఈ చిల్లర సర్వేలన్నీ తప్పు అని స్పష్టం అవుతోంది. కనుక వాటిని మనం పట్టించుకోవద్దు,” అని అన్నారు.

రాష్ట్రంలో ఎన్నికలు లేని సమయంలోనే అంటే రెండేళ్ళ క్రితం నుంచే సిఎం కేసీఆర్‌ సర్వేలు చేయించుకొంటూ ఫలితాలు ప్రకటిస్తున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచార సభలలో కూడా తాజా సర్వే నివేదిధిక ఇప్పుడే చేతికి అందిందంటూ తెరాస 103-108 సీట్లు గెలుచుకోబోతోందని ప్రకటించారు. అది నిజమేనని ఆయన గట్టిగా నమ్ముతున్నట్లయితే లగడపాటి వంటివారు ప్రకటించే సర్వేలను చూసి ఇంతగా అసహనం, ఆవేశం చెందనవసరంలేదు. అంత భారీ మెజార్టీతో గెలవబోతున్నప్పుడు మొహంలో ఆ ధీమా, సంతోషం కనబడాలి తప్ప ఆవేశం, ఆందోళన కాదు. ఆందోళన చెందితే ప్రజలు, ప్రతిపక్షాలు వేరేలా భావిస్తారు. అయినా ఎవరి సర్వేలు నిజమో మరో 11 రోజులలో ఎలాగూ తేలిపోతుంది కదా. 


Related Post