కేసీఆర్‌కు నిమ్మరసం ఇస్తే మాకు విషం ఇచ్చాడు: మందకృష్ణ

November 30, 2018


img

ఈరోజు మంచిర్యాలలో జరిగిన ప్రజాకూటమి బహిరంగసభలో ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ సిఎం కేసీఆర్‌పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాటలు విన్నవారు కేసీఆర్‌పై ఆయనకు మనసులో ఇంత ఆగ్రహం ఉందా? అని ఆశ్చర్యపోకమానరు. కేసీఆర్‌ గురించి మందకృష్ణ మాదిగ ఎమ్మన్నారంటే... 

1. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనకు ఆంధ్రాలో అందరూ గట్టిగా వ్యతిరేకిస్తుంటే, మాలమాదిగ కుల సంఘాల మద్దతు కూడగట్టింది నేనే. ఆ తరువాత ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసింది వారిలో నేను ఒకడిని. కానీ తెలంగాణ రాగానే మొట్టమొదట ఆయన మమ్మల్నే మోసం చేశారు. దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి ఆ కుర్చీలో తనే కూర్చొని మొదటిసారి మోసం చేశారు. ఈవిధంగా చేస్తే దళితులు తనను నిలదీయవచ్చునని ముందే ఊహించిన కేసీఆర్‌ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మభ్య పెట్టి ఎవరినీ నోరెత్తకుండా చేసారు. కానీ నాలుగున్నరేళ్లు గడిచిపోయినా దళితులకు ఒక్క ఎకరం భూమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? అంటే రాష్ట్రంలో అమ్మకానికి భూమి దొరకలేదన్నారు. కానీ తన ఫాంహౌసు కోసం గజ్వేల్ లో 60 ఎకరాలు కొనుకోగలిగారు. అంతా చిన్న గ్రామంలో ఆయన తన కోసం అంత భూమి కొనుగోలు చేయగలిగినప్పుడు దళితులకు ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా భూములు లభించలేదంటే నమ్మశక్యంగా ఉందా? ఇది దళితులను మోసం చేయడం కదా? 

2. కేసీఆర్‌ ఒక్క దళితులనే కాదు... బీసీలకు 33శాతం, గిరిజనులకు,ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేశారు. 

3. లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులను, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తామని పేదలను మోసం చేశారు. 

4. తన మంత్రివర్గంలో ఒక్క మహిళను, మాల, మాదిగను కూడా తీసుకోకుండా వారి పట్ల చులకన భావం ప్రదర్శించారు. 

5. ‘తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ’ అంటూ ఆనాడు దణ్ణం పెట్టిన కేసీఆర్‌, ఇప్పుడు అదే నోటితో ఆమెను, ఆమె వంశాన్ని తిట్టిపోస్తున్నారు. మనకు సాయం చేసిన ఒక తల్లి పట్ల మనం ఇలాగేనా వ్యవహరిస్తాము? ఇది తప్పు కాదా? 

6. తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి మనకు ఎంతో సహకరించిన దళిత మహిళ స్పీకర్ మీరా కుమార్ మన రాష్ట్రానికి వస్తే ఆమెను కూడా కేసీఆర్‌ అవమానించి పంపించారు.   

7. తెలంగాణ ఉద్యమాలలో కేసీఆర్‌ వెన్నంటి ఉన్న సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాలు, మెడికల్, హౌసింగ్ వగైరాలు కల్పిస్తామని మోసం చేశారు. 

8. తెలంగాణ ఉద్యమాలలో ఆయన వెన్నంటి ఉన్న కోదండరామ్‌ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని అడిగి నందుకు ఆయన ఇంటి తలుపులు పగులగొట్టించి అరెస్ట్ చేయించారు. 

9. ప్రజాహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ను పోలీసులు ఒక క్రిమినల్ ను పట్టుకొన్నట్లు కాలరు పట్టుకొని లాక్కొని వెళ్ళి అవమానించారు. ఆ సందర్భంగా ఆయన అన్న ఒక మాట నాకు ఇప్పటికీ మనసులో మెదులుతోంది. ఆనాడు సమైక్యరాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ మనం సాగరహారం, మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఏనాడూ పోలీసులు మన ఇంటి తలుపు తట్టలేదు. కానీ పొరాడి సాధించుకొన్న తెలంగాణలో రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్‌ను ప్రశ్నిస్తే చాలు పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టుకొని వచ్చి మరీ పట్టుకుపోతున్నారు అని అన్నారు. 

10. రాష్ట్రంలో నాలుగేళ్ళుగా నిర్బంద, నిరంకుశ, అప్రజాస్వామిక కుటుంబ పాలన సాగుతోంది. కనుక రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేస్తూ, నిరంకుశ కుటుంబపాలన సాగిస్తున్న ఈ కేసీఆర్‌ను గద్దె దించడం కోసమే మనం ఏర్పాటు చేసుకొన్న ప్రజాకూటమిని గెలిపించుకొంటే తప్ప రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుపడవు,” అని మందకృష్ణ మాదిగ అన్నారు. 


Related Post