తెలంగాణ ఎన్నిలపై లగడపాటి జోస్యం

November 30, 2018


img

మాజీ ఎంపీ, మాజీ కాంగ్రెస్‌ నేత లగడపాటి రాజగోపాల్ ఎన్నికల సమయంలో సర్వేలు జరిపించి పార్టీల జయాపజయల గురించి చెపుతుంటారు. ఆయన సర్వేలు నిష్పక్షపాతంగా వాస్తవాలకు దగ్గరగా ఉంటాయనే మంచి పేరుంది కనుక తెలంగాణ ఎన్నికలపై ఆయన ఏమి చెపుతారనే దానిపై రాజకీయ వర్గాలలో కూడా కొంత ఆసక్తి నెలకొని ఉంది.

శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న తరువాత మీడియాతో మాట్లాడుతూ, “ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగడం లేదు. కొన్నిచోట్ల అధికార, ప్రతిపక్షపార్టీల అభ్యర్ధులను ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడే ప్రజలు వారికి ఓటేయబోమని చెప్పి నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు. 

ఈసారి ఎన్నికలలో 8-10 మంది స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించబోతున్నారు. స్వతంత్ర అభ్యర్ధుల పేర్లను ముందుగా ప్రకటించడం వలన ప్రధానపార్టీల విజయావకాశాలపై ఎటువంటి ప్రభావం ఉండబోదు కనుక నేటి నుంచి రోజుకు ఇద్దరు పేర్లను ప్రకటిస్తాను. వారిలో మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణ పేట్‌ నుంచి బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి శివకుమార్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్‌ జాదవ్‌ ఈ ఎన్నికలలో తప్పకుండా గెలవబోతున్నారు. డిసెంబరు 7వ తేదీ సాయంత్రం నా పూర్తి సర్వే నివేధికను బహిర్గతం చేస్తాను,” అని చెప్పారు. 

నారాయణ పేట్‌ నుంచి రాజేందర్ రెడ్డి (తెరాస), వామనగిరి కృష్ణ (కాంగ్రెస్‌), కెఆర్ పండు రెడ్డి (బిజెపి) పోటీ చేస్తున్నారు. 

బోథ్‌ నుంచి బాబూరావు రథోడ్ (తెరాస), సోయం బాబూరావు (కాంగ్రెస్‌), మాధవిరాజు (బిజెపి) పోటీ చేస్తున్నారు.   

లగడపాటి జోస్యం నిజమనుకొంటే ఈసారి ఎన్నికలలో తెరాసకు 103-108 సీట్లు, మజ్లీస్ పార్టీకి 7 సీట్లు వస్తాయని గట్టిగా చెపుతున్న సిఎం కేసీఆర్‌కు కూడా ఇది షాకింగ్ న్యూసేనని చెప్పవచ్చు. అలాగే ఈ రెండు నియోజకవర్గాలలో ప్రధానంగా పోటీ పడుతున్న కాంగ్రెస్‌, తెరాస అభ్యర్ధులకు పెద్ద షాక్ అని చెప్పవచ్చు. లగడపాటి జోస్యం నిజమవుతుందో లేదో తెలియాలంటే డిసెంబరు 11 వరకు వేచి చూడాలి.


Related Post