రాహుల్ గాంధీ ఓ జోకర్: కేసీఆర్‌

November 30, 2018


img

ఈరోజు మధ్యాహ్నం ఖమ్మం జిల్లా ఇల్లందులో ప్రజా ఆశీర్వాదసభలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతో “కాంగ్రెస్‌ నేతలకు కమీషన్లు తీసుకోవడం తప్ప మరేమీ తెలియదు. అందుకే వారికి మా ప్రతీ పనిలో కమీషన్లే కనబడుతున్నాయి. కమీషన్ల కోసమే నేను ప్రాజెక్టులు రీ-డిజైన్ చేయించానని మొన్న రాహుల్ గాంధీ అన్నారు. నిజానికి దేశ రాజకీయాలలో రాహుల్ గాంధీ ఒక పెద్ద జోకర్. ఈ కాంగ్రెస్‌ దద్దమ్మలు ఏది వ్రాసిస్తే అది చదవడం తప్ప ఆయనకు ఇక్కడి సమస్యలు, భౌగోళిక పరిస్థితులు, నీటి లభ్యత, పారుదల, మన అవసరాల గురించి ఏమీ తెలియదు. 

ఒకప్పుడు కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టులు కడుతున్నామని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను మొదలుపెట్టారు. కానీ వాటి వలన జిల్లాకు ఏ ఉపయోగం ఉండదని ఇక్కడి కాంగ్రెస్‌ నేతలకు కూడా తెలుసు. ఆంద్రా పాలకులు మన నీళ్ళను ఎత్తుకుపోతుంటే వాళ్ళలో ఏ ఒక్కరూ కూడా  నోరు మెదపలేకపోయారు. మనం కోట్లాడి తెలంగాణ సాధించుకొన్నాక ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ప్రాజెక్టులను రీ-డిజైనింగ్ చేయించుకొని శరవేగంగా పనులు చేసుకొంటున్నాము. 

రాహుల్ గాంధీకి ఇక్కడి సమస్యలు, పరిస్థితులు ఏమీ తెలియవు. ఈ కాంగ్రెస్‌ దద్దమ్మలు ఆయనకు చెప్పరు. కనుక ఆయన కూడా వారు వ్రాసిచ్చిందే చిలకలా వల్లిస్తుంటారు. ఆయనకు నిజాలు తెలుసుకోవాలని ఉంటే ఒకసారి రుద్రకోట దగ్గరకు వస్తే మనం ఎక్కడ ఏ ప్రాజెక్టు కడుతున్నాము...దాని వలన ఏయే ప్రాంతాలకు ఎన్ని నీళ్ళు అందించబోతున్నాము? అనే వివరాలు నేనే ఆయనకు తెలియజేస్తాను. 

ప్రాజెక్టుల గురించి ఏ మాత్రం అవగాహన లేని ఈ కాంగ్రెస్‌ నేతలు, ఈ ప్రాజెక్టులు ఆపించేయాలని కుట్రలు చేస్తున్న చంద్రబాబు నాయుడు చేతికి అధికారం దక్కితే ఏమవుతుందో ప్రజలందరూ ఆలోచించాలి. గత 58 ఏళ్లలో కాంగ్రెస్‌, టిడిపిల పాలనలో తెలంగాణ పరిస్థితి ఏవిధంగా ఉండేదో మీరందరూ చూశారు. అలాగే గత నాలుగేళ్లలో రాష్ట్రంలో, మీ జిల్లాలో, మీ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో, ఏమేమి సంక్షేమ పధకాలు అమలయ్యాయో మీరందరూ కళ్ళారా చూస్తున్నారు. కనుక మా పాలనను వారితో బేరీజు వేసుకొని ఎవరి వలన మీకు మేలు కలిగిందని భావిస్తారో మీరే నిర్ణయించుకోండి. మీ ఓటే మీ భవిష్యత్ ను నిర్ణయించబోతోంది. ప్రతిపక్ష పార్టీల మాయమాటల నమ్మి మోసపోకుండా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి,” అని కేసీఆర్‌ అన్నారు.        



Related Post