తెరాస నన్ను హత్య చేసినా ఆశ్చర్యం లేదు: రేవంత్‌రెడ్డి

November 30, 2018


img

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “తెరాస ప్రభుత్వం నన్ను హత్య చేసేందుకు కుట్రలు పన్నుతోంది. మావోయిస్టులను మట్టుబెట్టడంలో ఆరితేరిన కొందరు పోలీసులను ఇందుకు వినియోగిస్తున్నట్లు నావద్ద పక్కా సమాచారం ఉంది. మఫ్టీలో ఉన్న పోలీసులు నాపై దాడికి పాల్పడే అవకాశం ఉంది. కేసీఆర్‌కు రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి, ఇంటలిజన్స్ ఐజి ఇద్దరూ అన్ని విధాలా తోడ్పడుతున్నారు. 

రాష్ట్రమంతటా పోలీసులు వాహనాలను తనికీ చేస్తున్నప్పుడు, కొడంగల్‌ తెరాస అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి నివాసంలో, ఆయన బందువుల ఇళ్లలో అన్ని కోట్లు ఎలా వచ్చాయంటే పోలీసు వాహనాలలోనే ఆ డబ్బును తరలిస్తున్నారు గనుక. పట్నం నరేందర్ రెడ్డికి సంబందించిన సీల్డ్ కవర్-నివేదిక అందిందని ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్‌ చెప్పారు. దానిని తెరిచి ఆ వివరాలు మీడియాకు తెలియజేయడానికి ఆయనకు ఇంకా ఎన్నిరోజులు పడుతుంది?

పట్నం నరేందర్ రెడ్డి, ఆయన బందువుల ఇళ్లలో ఐ‌టి దాడులు చేసి రూ.51 లక్షలు స్వాధీనం చేసుకొన్నామని చెబుతున్న అధికారుల మాటలు అబద్దం. వారు రూ.17.51 కోట్లు స్వాధీనం చేసుకొంటే, కేసీఆర్‌ ఒత్తిడికి తలొగ్గి రూ.51 లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకొన్నామని అబద్దం చెపుతున్నారు. శుక్రవారం నుంచి కొడంగల్‌కు భారీ మొత్తంలో డబ్బు మూటలు రాబోతున్నాయి. పోలీసులు వాటిని పట్టుకొని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఆ వంకతో కొడంగల్‌లో ఎన్నికలను వాయిదా వేయాలని కుట్ర జరుగుతోంది. 

ప్రతిపక్ష అభ్యర్ధులను భయబ్రాంతులకు గురిచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్‌ ఖూనీ చేస్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్షపార్టీల అభ్యర్ధులకు పూర్తి రక్షణ కల్పించాలి,” అని డిమాండ్ చేశారు. 

తనను హత్య చేసేందుకు తెరాస ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్న రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలలో నిజానిజాలను పోలీసులు, ఎన్నికల సంఘమే నిగ్గు తేల్చాలి. అలాగే పట్నం నరేందర్ రెడ్డి, బందువుల ఇళ్లలో ఐ‌టి సోదాలు జరిగాయని, దానికి సంబందించి నివేదిక అందిందని చెప్పిన రజత్‌కుమార్‌ దానిని బయటపెట్టి తన విశ్వసనీయతను నిరూపించుకోవలసి ఉంటుంది.  

ఘోషామహల్ బిఎల్ఎఫ్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న చంద్రముఖిని ఇటీవల ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం, హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆమెను వెతికి పట్టుకొని కోర్టులో హాజరుపరచడం, ఎన్నికలయ్యే వరకు ఆమెకు పోలీసులు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించడం, అలాగే గద్వాల్ లో సిఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్న వంటేరు ప్రతాప్ రెడ్డి, ఆయన అనుచరులకు పోలీసుల వేధింపులు వంటి పరిణామాలు గమనించినట్లయితే, ఈసారి ఎన్నికలలో ప్రతిపక్షపార్టీల అభ్యర్ధులు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో అర్ధమవుతుంది. కనుక ఎన్నికల సంఘం మరింత నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించి తన విశ్వసనీయతను, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకోవలసి ఉంటుంది.


Related Post