ఇప్పుడు ఆ చర్చ అవసరమా?

November 29, 2018


img

తెలంగాణ ఎన్నికల సందర్భంగా కొన్ని అప్రస్తుత అంశాలపై కూడా పార్టీల మద్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. వాటిలో తెలంగాణ రాష్ట్రం ఎవరి వలన ఏర్పడిందనేది ఒకటి. 

దీనిపై మూడు ప్రధాన పార్టీల వాదనలను విన్నట్లయితే “తెలంగాణ రాష్ట్రాన్ని తాము ‘ప్రసాదించామని’ కాంగ్రెస్‌ నేతలు చెప్పుకొంటుంటే, “మేము సహకరించబట్టే తెలంగాణ ఏర్పడిందని” బిజెపి నేతలు వాదిస్తున్నారు. కానీ “తెలంగాణను మేము కోట్లాడి సాధించుకొన్నామని” తెరాస చెపుతోంది. 

ముందుగా తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ ఏవిధంగా వ్యవహరించిందని ఆలోచిస్తే, తెలంగాణ రాష్ట్రం కోసం 1,200 మందికి పైగా యువకులు బలిదానాలు చేసుకొన్నప్పటికీ అప్పుడు అధికారంలో ఉన్న యూపీయే ప్రభుత్వం ఏమాత్రం చలించలేదు. చాలా తాపీగా కూడికలు తీసివేతలు వేసుకొని, తెలంగాణ ఇస్తే తమ పార్టీకి ఎన్నికలలో లాభం కలుగుతుందని నమ్మినందునే ఇచ్చిందని అందరికీ తెలుసు. తెలంగాణ బిడ్డల ఉసురుపోసుకొన్న సోనియాగాంధీ ఇప్పుడు తెలంగాణ ప్రజలను చూస్తే తన కడుపు తరుక్కుపోతోందని చెప్పడం విడ్డూరంగా ఉంది. అప్పుడు పదేళ్ళ పాటు ఏకధాటిగా ప్రజలు ఉద్యమాలు చేసినప్పుడు వారి ఆకాంక్షలను గుర్తించలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే తెలంగాణ ఇచ్చామని, మళ్ళీ వాటి కోసమే ప్రజాకూటమిని ఏర్పాటు చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. 

బిజెపి విషయానికి వస్తే, తాము నాలుగు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకొంటున్నప్పుడు అది తెలంగాణ కోసం కూడా గట్టిగా ప్రయత్నించి ఉంటే బాగుండేది. అది కూడా ఉద్యమాలలో పాల్గొంది కానీ యూపీయే ప్రభుత్వంపై తెలంగాణ కోసం గట్టిగా ఒత్తిడి తేలేదు. తనకున్న ఎంపీలతో, తన కూటమిలోని పార్టీల మద్దతుతో యూపీయే ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి తెచ్చి ఉండి ఎప్పుడో తెలంగాణ ఏర్పడి ఉండేది. పదేళ్ళపాటు నిర్లిప్తంగా వ్యవహరించి చివరికి తప్పనిసరి పరిస్థితులలో యూపీయే ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేయడానికి సిద్దపడినప్పుడు, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బిజెపి మద్దతు పలికింది అంతే. కానీ ఇప్పుడు తమ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గొప్పలు చెప్పుకొంటోంది. 

తెరాస విషయానికి వస్తే అది చెపుతున్న మాట నూటికి నూరు శాతం నిజమని తెలుసు. గతంలో రెండుమూడు సార్లు తెలంగాణ ఉద్యమాలు విఫలం అయినప్పటికీ చిట్టచివరిగా ప్రయత్నాలు మొదలుపెట్టిన కేసీఆర్‌ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. దానికోసం ఆయన అనేక సవాళ్లను, అవమానాలను భరించిన మాట వాస్తవం. అయినప్పటికీ వాటిని ఎదుర్కొవడానికి ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలు రచించుకొని అమలుచేస్తూ తన లక్ష్యం వైపు దూసుకుపోయారు. ఆ ప్రయత్నంలో ఆయన ప్రదర్శించిన నాయకత్వ లక్షణాలు, రాజకీయ చతురత, అందరినీ కలుపుకుపోయిన పద్దతి అందరికీ తెలుసు. కనుక తెలంగాణ ఏర్పాటులో  ఆయన పాత్రను ఎవరూ కాదనలేరు. అదేవిధంగా బలిదానాలు చేసుకొన్న అమరవీరులు, చదువులు, ఉద్యోగాలు, తమ భవిష్యత్ ను పక్కన పెట్టి పోరాడిన యువత, కేసీఆర్‌ వెంట సైనికుల్లా నడిచిన తెలంగాణ ప్రజలూ అందరూ కలిసి పొరాడి తెలంగాణ సాధించుకొన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఎవరు సాధించారనే చర్చ అప్రస్తుతం. ఎవరిని ఎన్నుకొంటే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది? ప్రజలకు మేలు కలుగుతుంది? అని అందరూ లోతుగా ఆలోచించవలసిన సమయం ఇది. 


Related Post