బిజెపికి బీ-టీం తెరాస..ముందు దానిని ఓడిద్దాం: రాహుల్

November 29, 2018


img

రాష్ట్రంలో ఈరోజు రాహుల్ గాంధీ నిర్వహించిన వేర్వేరు బహిరంగసభలలో కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు. బిజెపి-ఏ టీం కాగా దానికి తెరాస బి-టీం, మజ్లీస్ పార్టీ సి-టీం అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఆ రెండూ మోడీ కనుసన్నలలో పనిచేస్తున్నాయని ఆరోపించారు. తెరాస ఇప్పుడు టిఆర్ఎస్ కాదని టి-ఆర్ఎస్ఎస్ అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ముందుగా రాష్ట్రంలోని ఈ బి,సి టీంలను రెంటినీ ఓడించిన తరువాత ఏ-టీంను ఓడించడం గురించి ఆలోచిద్దామని అన్నారు. 

యూపీయే ప్రభుత్వం రైతులకు న్యాయం చేసేందుకు భూసేకరణ చట్టం-2013ను తెస్తే, మోడీ కేసీఆర్‌ ఇద్దరూ కలిసి దానిని త్రొక్కి పట్టి రైతుల భూములను బలవంతంగా గుంజుకొంటున్నారని ఆరోపించారు. వారిద్దరూ మాయమాటలు చెప్పడంలో ఆరితేరినవారని అందుకే పాత హామీలను అమలుచేయకుండా చేసినట్లు చెపుతూ మళ్ళీ కొత్త హామీలు ఇస్తున్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మిషన్ భగీరధ ద్వారా రాష్ట్రంలో ఇంటింటికీ నీళ్ళు ఇవ్వకపోతే ప్రజలను ఓట్లు అడగనని చెప్పుకొన్న కేసీఆర్‌ ఆ పనులు పూర్తికాక మునుపే 9 నెలల ముందుగా ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వచ్చేరని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో పేదల కోసం 2.50 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌ నాలుగేళ్ళలో 5,000 ఇళ్ళు మాత్రమే కట్టించి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి హామీని కేసీఆర్‌ ఎప్పుడో మరిచిపోయారని ఎద్దేవా చేశారు. 

సుమారు 16,000 కోట్లు మిగులుతో చేతికి అందిన రాష్ట్రాన్ని కేసీఆర్‌ కేవలం నాలుగేళ్లలో రూ.2.0 లక్షల కోట్లు అప్పులలో ముంచేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత ప్రాజెక్టుకు కాళేశ్వరంగా పేరు మార్చి రూ.40,000 కోట్లు అంచనాలు పెంచేశారని, ఆ సొమ్మును కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, కాంట్రాక్టర్లు జేబులో వేసుకొన్నారని ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పధకాలలో కేసీఆర్‌ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టులను రీ-డిజైనింగ్ చేయించారని వాటి వలన ప్రజలకు ఏ ఉపయోగం ఉండదని రాహుల్ గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను కమీషన్ రావుగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. 


Related Post