కాంగ్రెస్‌, బిజెపి, తెరాసల మద్య అదే తేడా!

November 29, 2018


img

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి కనుక అన్ని పార్టీలు తాము రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం గతంలో ఏమేమి చేశాయో…ఇప్పుడు గెలిపిస్తే భవిష్యత్ లో ఏమిచేస్తాయో ప్రజలకు వివరించి చెపుతూ ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే  మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపి, తెరాసల తీరును నిశితంగా గమనిస్తే ఒక విషయం అర్ధం అవుతుంది. 

కాంగ్రెస్‌ పార్టీ తమ హయంలో చేసిన అభివృద్ధి పనులను నెమరువేస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే, తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉదారంగా వ్యవహరిస్తూ రాష్ట్రాభివృద్ధికి రూ. 2-3 లక్షల కోట్లు ఇచ్చి సహకరించిందని బిజెపి చెప్పుకొంటోంది. రాష్ట్ర ఆదాయాన్ని అభివృద్ధి చేసి దానిని మళ్ళీ ప్రజలకే పంచిపెడుతున్నామని, తెలంగాణలో ప్రతీ గ్రామం, ప్రతీ పౌరుడు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పొందాలన్నదే తమ ధ్యేయమని తెరాస చెపుతోంది.

ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ వాదనలను పక్కన పెడితే, మిగిలింది బిజెపి, తెరాసలు. వాటిలో బిజెపి తెలంగాణ రాష్ట్రానికి సహాయం చేయడం చాలా గొప్ప విషయమన్నట్లు మాట్లాడుతుంటే, తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం మా బాధ్యత అని తెరాస వినయంగా చెప్పుకోవడం అందరూ గమనించే ఉంటారు. నిజానికి కేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అభివృద్ధి, సంక్షేమం భాద్యతగానే భావించాలి తప్ప ప్రజలను ఉద్దరిస్తున్నట్లు భావించడం సరికాదు. ఈ విషయం తెరాస బాగానే గ్రహించింది. అందుకే ‘తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అందమైన పొదరిల్లులా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నానని’ సిఎం కేసీఆర్‌ వినయంగా చెపుతున్నారు. 

కేంద్రప్రభుత్వానికి పన్నుల రూపంలో దేశంలో అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. తద్వారా దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం సహకరిస్తోందని చెప్పవచ్చు. కానీ తెలంగాణ ఇచ్చిన ఆ సొమ్ములో కొంత భాగాన్ని తిరిగి ఇచ్చి తెలంగాణకు ఏదో గొప్ప మేలు చేశామన్నట్లు బిజెపి మాట్లాడుతోంది. ప్రజాధనాన్ని మళ్ళీ ప్రజల కోసం, దేశం కోసం ఖర్చు చేయడం గొప్ప విషయమెలా అవుతుంది? గొప్ప విషయమనుకొంటే అది అహంకారం... బాధ్యత అనుకొంటే అది ప్రజల పట్ల విధేయత, అభిమానం అవుతుంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సహకరించడం దాని భాద్యతే తప్ప గొప్పదనం కాదని గ్రహించి తదనుగుణంగా బిజెపి తన ఎన్నికల ప్రచారశైలిని, బాషను మార్చుకొంటే దానికే మంచిది. 


Related Post