కేసీఆర్‌ మాకు హ్యాండ్ ఇచ్చారు అందుకే... మందకృష్ణ

November 28, 2018


img

ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ప్రజాకూటమికి మద్దతు ప్రకటించారు. “తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్‌ మొదటే దళితులను మోసం చేశాడు. ఆ తరువాత వర్గీకరణ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించేందుకు అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకువెళతామని అసెంబ్లీలో ప్రకటించి ఆ తరువాత ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు. పైగా మేము దాని కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో ఆదివాసీలు, లంబాడీల మద్య చిచ్చు పెట్టి తప్పించుకొన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ల విషయంలో కూడా ముస్లింలతో ముడిపెట్టి ఒక తీర్మానం చేసి డిల్లీకి పంపించి చేతులు దులుపుకొని రెండు వర్గాలను కేసీఆర్‌ మోసం చేశారు. కేసీఆర్‌ తన మంత్రివర్గంలో ఒక్క బీసీ లేదా దళిత మహిళకు చోటు కల్పించాలనుకోలేదు. కేసీఆర్‌ కేవలం మాయమాటలతో అన్ని వర్గాల ప్రజలను మభ్యపెడుతున్నారని అర్ధం అయ్యింది. 

కనుక మా దళితులకు లోక్ సభ, రాజ్యసభలో ఒక్కో సీటు, అలాగే మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము. అలాగే చిరకాలంగా నానుతున్న వర్గీకరణ సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. కనుక ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఆ తరువాత జరిగే లోక్ సభ ఎన్నికలలో కూడా ప్రజాకూటమికి మేము మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకొన్నాము. మా దళిత అభ్యర్ధులు బరిలో ఉన్న నియోజకవర్గాలలో మేము వారి తరపున ఎన్నికల ప్రచారం చేస్తాము,” అని మందకృష్ణ మాదిగ చెప్పారు.

అయితే దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మందకృష్ణ మాదిగను, అలాగే బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్.కృష్ణయ్యను ఇక్కడ ఒక ప్రశ్న అడగవలసిన అవసరం ఉంది. దళితులకు, బీసీలకు టికెట్ల కేటాయింపులో పెద్దపీట వేసి వారికి రాజ్యాధికారం కల్పించడానికి ఎన్నికలలో పోరాడుతున్న బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్ (బిఎల్ఎఫ్)కు వారిరువురూ మద్దతు ఈయకుండా, అగ్రవర్ణాలకు మెజార్టీ స్థానాలు (టికెట్లు) కేటాయించిన ప్రజాకూటమికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు?ఈ ఎన్నికలలో బిఎల్ఎఫ్ ఓడిపోతుందని వారు నమ్ముతున్నందునా? లేక ప్రజాకూటమికి విజయావకాశాలున్నాయని నమ్ముతున్నందునా? లేక తమకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు లభిస్తునందునా? 


Related Post