కలిసి ఉద్యమాలు చేయగా లేనిది పోటీ చేస్తే తప్పా? కోదండరామ్‌

November 28, 2018


img

కొడంగల్‌ నియోజకవర్గంలో కొస్గీలో బుదవారం ప్రజాకూటమి అధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభలో టిజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ,” “ఉద్యమ సమయంలో కొడంగల్‌ ప్రజలు సింహాలవలె తెలంగాణ కోసం పోరాడారు. అయితే వారిపోరాటాలు ఫలించి తెలంగాణ ఏర్పడినప్పటికీ వారి ఆకాంక్షలు మాత్రం నేటికీ నెరవేరలేదు. నారాయణ్ పేట నుంచి కొడంగల్‌కు వస్తుంటే దారిలో పొలాలన్నీ బీడుపెట్టబడి కనబడ్డాయి. తెరాస వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు కానీ జరిగిందేమిటి? కొడంగల్‌లోఅనేకమంది పొట్ట చేతపట్టుకొని వలసలకు పోవడంతో దారిలో అనేక ఇళ్లకు తాళాలు వేసున్నాయి. ఇక సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుకొంటే, మన పక్కనే పారుతున్న కృష్ణానదిలో నీళ్ళు తీసుకోకుండా వాటిని శ్రీశైలం వరకు పారనిచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఎగువ ప్రాంతమైన ఇక్కడకు ఎత్తిపోస్తారంట కేసీఆర్‌. ముక్కు ఎక్కడ ఉందంటే చుట్టూ తిప్పి చూపుతున్నాడు ఆ పెద్దమనిషి. 

నీటివాటం ఎటుందో కూడా తెలుసుకోకుండా ప్రాజెక్టులను రీడిజైన్ చేశారు. అది కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే తప్ప ప్రజలకు నీళ్ళు అందించేందుకు కాదు. జూరాల నుంచి నారాయణ పేటకు నీళ్ళు మళ్లించుకొంటే ఈ ప్రాంతాలన్నిటికీ నీళ్ళు అందుతాయి కదా? అని మేము చెప్పబోతే నీకేమీ తెల్వదు..మాట్లాడకు అంటాడు కేసీఆర్‌. దిగువ నుంచి ఎగువకు నీళ్ళు పారిస్తామని చెపుతున్న కేసీఆర్‌ మాటలు విని ఇంజనీర్లు, సామాన్య ప్రజలు కూడా నవ్వుకొంటున్నారు. అయినా కేసీఆర్‌ తాను చెప్పిందే వేదం అంటాడు.

తెలంగాణ ఏర్పడింది 4 కోట్ల ప్రజల కోసమే కానీ నలుగురు కేసీఆర్‌ కుటుంబ సభ్యుల కోసం కాదు. ఆ 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసమే ప్రజాకూటమి ఏర్పడింది. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం అందరం కలిసి పోరాడాము. ఇప్పుడు కేసీఆర్‌ కుటుంబ కబందహస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించుకొనేందుకే ప్రజాకూటమిగా కలిసి పోరాడుతున్నాము. ఆనాడు తెలంగాణ కోసం గొంగళీపురుగును కూడా ముద్దాడుతానని కేసీఆర్‌ అన్నారు కదా? మా నాలుగు పార్టీలు పొత్తులు పెట్టుకొని ఎన్నికలలో పోటీ చేస్తుంటే కేసీఆర్‌కు అభ్యంతరం దేనికి? 

తెలంగాణ వస్తే ఏమి జరుగుతుందని మానందరం ఆశపడ్డామో దానికోసమే ప్రజాకూటమిని ఏర్పాటు చేసుకొన్నాము. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజం చేసుకోవడానికే ప్రజాకూటమి ఏర్పాటు అయింది. ఎన్నికలలో గెలిచి మేము అధికారంలోకి వస్తే ఏవిధంగా కలిసికట్టుగా ముందుకు సాగాలో, ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలో, ఎటువంటి ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలుచేయాలో  అన్ని ముందే నిర్ణయించుకొన్నాము. ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయం. రాగానే మేము ముందే అనుకొన్నవిధంగా మా కామన్ మినిమమ్ అజెండా అమలుకు సాధికారిక కమిటీని ఏర్పాటు చేసుకొని దాని మార్గదర్శకత్వంలో పనిచేస్తాము. కనుక దీని గురించి కేసీఆర్‌, తెరాస నేతలు చెపుతున్న మాట్లను, ఆయన చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు నేను చేస్తున్నాను. కొడంగల్‌ సింహం... మీ అందరి అభిమాన నాయకుడు రేవంత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు చేస్తున్నాను. ఫాంహౌసులో పడుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతున్న కేసీఆర్‌ను అందరం కలిసి తప్పకుండా ఫాంహౌసుకు పంపించాలి,” అని కోదండరామ్‌ అన్నారు.


Related Post