కేసీఆర్‌ ఫజిల్ ను ఎవరు సృష్టించారు?

November 28, 2018


img

సిఎం కేసీఆర్‌ నిన్న ఆమనగల్లు సభలో ప్రసంగిస్తూ, “ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి నన్ను ఒక ‘రాజకీయ ఫజిల్’గా మార్చాయి. కానీ నేను ఏ పార్టీతో రహస్యంగా పొత్తులు పెట్టుకోలేదు. మజ్లీస్ పార్టీ ఒక్కటే మాకు మిత్రపక్షమని నేను బహిరంగంగా చెపుతున్నాను. మీరు నా మాట నమ్మండి,” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

నిజానికి ఈ ‘కేసీఆర్‌ ఫజిల్’ను ఆయనే స్వయంగా సృష్టించుకొన్నారని చెప్పక తప్పదు. ఒకపక్క మోడీతో దోస్తీ చేస్తూ, కర్నాటకలో కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెడిఎస్ పార్టీకి మద్దతు పలికారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని శత్రువుగా భావిస్తూ దానితో యుద్దం చేస్తున్నారు. ప్రజలను కన్ఫ్యూజ్ అవ్వొద్దు... అంటూనే తానే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తాను కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెపుతున్నారు. కానీ మోదీతో అనుబందం గురించి సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. 

ఒకేసారి రెండు విభిన్నమైన మతతత్వపార్టీలైన బిజెపి, మజ్లీస్ పార్టీలతో దోస్తీ చేస్తూ కేసీఆర్‌ ఈ ఫజిల్ క్రియేట్ చేశారు. అలాగే మజ్లీస్ వంటి పక్కా మతతత్వపార్టీతో అంటకాగుతూ తాను పక్కా లౌకికవాదినని, తాము పక్కా లోకల్ అని కేసీఆర్‌ చెప్పుకొంటున్నారు. ఆయన పక్కా లోకల్ అనే విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు కానీ మోడీతో ఎటువంటి సంబందం, రహస్య అవగాహన లేదంటే నమశక్యంగా లేదు.

ఈవిధంగా పొంతనలేని ఆలోచనలు, మాటలు, విధానాలతో కేసీఆర్‌ తన విశ్వసనీయతను ప్రశ్నార్ధకంగా మార్చుకొన్నారని చెప్పక తప్పదు. కేసీఆర్‌ స్వయంగా ఈ ఫజిల్ ను సృష్టించుకొని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి తనను ఒక ‘ఫజిల్’ గా మార్చాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించడం విడ్డూరంగా ఉంది. ఆయనే ఈ ఫజిల్ సృష్టించారు కనుక దానిని పరిష్కరించవలసిన బాధ్యత కూడా ఆయనదేనని చెప్పక తప్పదు. 


Related Post