మోడీ ఆ మాటేలా అనగలిగారో...

November 28, 2018


img

ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం నిజామాబాద్‌ బహిరంగసభలో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ హయాంలో ప్రభుత్వరంగ బ్యాంకులలో ఉండే ప్రజాధనాన్ని కొందరు రాజకీయ నాయకులు విచ్చలవిడిగా దోచుకొనేవారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దశాబ్ధాలుగా సాగిన ee బ్యాంక్ దోపిడీని అరికట్టాము. దేశంలో కోట్లాది నిరుపేదలకు జన్ ధన్ యోజన పేరిట బ్యాంక్ ఖాతాలు తెరిపించి, వారి ఖాతాలలోకి నేరుగా ప్రభుత్వ సంక్షేమ పధకాల సొమ్మును జమా చేస్తున్నాము. అలాగే దేశంలో కోట్లాదిమంది మహిళలకు కట్టెలపొయ్యిల నుంచి విముక్తి కల్పించడానికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నాము,” అని చెప్పారు.

 కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయ్ మాల్యా ఏకంగా 17 బ్యాంకులకు సుమారు రూ.9,000 కోట్లు కుచ్చు టోపీ పెట్టి లండన్ పారిపోగా ఆ తరువాత కొన్నాళకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోడి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 21,306 కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయాడు.  ఆ తరువాత మెహుల్ చొక్సీ, ఇంకా మరో ఇద్దరు పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు వేలకోట్లు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయారు. ఇక కొంతమంది రాజకీయనాయకులు, కార్పొరేట్ కంపెనీలు  బ్యాంకుల నుంచి లక్షల కోట్లు అప్పులు తీసుకొని, అధికార పార్టీ అండదండలతో బ్యాంకులకు ఆ డబ్బు చెల్లించకుండా ఎగవేస్తున్నవారు దేశంలోనే వేలమంది ఉన్నారు.

రుణాల పేరిట వారు చేస్తున్న దోపిడీ కారణంగా దేశంలో యావత్ బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాద పరిస్థితికి చేరుకొంది. మరి బ్యాంకింగ్ వ్యవస్థను తమ ప్రభుత్వమే కాపాడిందని మోడీ ఏవిధంగా చెపుతున్నారో? 

ఇక జన్ ధన్ యోజన పేరిట బ్యాంక్ ఖాతాలను నిర్వహించడం బ్యాంకులకు అధనపు భారంగా మారింది తప్ప వాటి వల్ల పేదలకు ఎటువంటి ఉపయోగమూ కలుగలేదనేది అందరికీ తెలుసు. ఇక నోట్ల రద్దును వ్యతిరేకించినందుకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘు రామరాజన్ ఎటువంటి అవమానకర పరిస్థితులలో రాజీనామా చేశారో అందరూ చూశారు. మళ్ళీ ఇటీవల కేంద్రప్రభుత్వం-రిజర్వ్ బ్యాంక్ మద్య సంబంధాలు దెబ్బ తినడంతో ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా వ్యవహరిస్తున్న ఉర్జీత్ పాటిల్ రాజీనామా చేయబోతున్నారంటూ వార్తలు రావడం అందరూ చూశారు. నోట్లరద్దుతో అటు బ్యాంకింగ్ రంగం ఇటు దేశప్రజలు ఎంత నష్టపోయారో, ఎన్ని కష్టానష్టాలు భరించారో అందరికీ తెలుసు. ఈ నేపద్యంలో మరి ప్రధాని మోడీ తమ ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో దోపిడీకి అడ్డుకట్టవేసి దానిని బలోపేతం చేశామని ఏవిధంగా అన్నారో? 


Related Post