తెరాస ఎత్తులు ఫలించలేదు పాపం!

November 27, 2018


img

ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ అభ్యర్ధి  మల్ రెడ్డి రంగారెడ్డి సోమవారం ఒక కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ, “ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇబ్రహీంపట్నం అంటే మల్ రెడ్డి రంగారెడ్డి. మల్ రెడ్డి రంగారెడ్డి అంటే ఇబ్రహీంపట్నం. కనుక ఇక్కడి కాంగ్రెస్ ఓట్లను ఏదో విధంగా చీల్చితేగానీ ఈసారి తెరాస అభ్యర్ధి విజయం సాధించలేడనే సంగతి తెరాస బాగానే గ్రహించింది. కనుక తెరాస తన అవినీతి సొమ్మును వెదజల్లి ముందుగా మల్ రెడ్డి రంగారెడ్డిని బరిలో నుంచి తప్పించాలని విఫలయత్నాలు చేసింది. కానీ దానికి కాంగ్రెస్‌ అధిష్టానం లొంగలేదు. 

కనుక ఈసారి తెరాస మరోవైపు నుంచి నరుక్కొంటూ వచ్చింది. టిడిపిలో ఒక వర్గంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతో అసలు సంబంధమే లేని, నియోజకవర్గం గురించి కనీస అవగాహన లేని వ్యక్తికి టికెట్ దక్కేలా చేసింది. దాంతో కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మం పాటిస్తూ మహాకూటమిలో పొత్తులలో భాగంగా టిడిపికి ఆ స్థానం కేటాయించక తప్పలేదు. అందుకే నేను బిఎస్పీ టికెట్ పై నామినేషన్ వేయవలసి వచ్చింది.

అయితే ఇల్లు అలకగానే పండుగ కాదని తెరాస గ్రహిస్తే మంచిది. తెరాస ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ ఓట్లు చీల్చలేదు. ఎందుకంటే, నేను ఏనుగు గుర్తుపై పోటీ చేస్తున్నానని చెప్పకపోయినా ప్రజలే ఆ విషయం తెలుసుకొని నలుగురికీ చెపుతున్నారు. నేను నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు వేలాదిగా తరలివస్తున్న ప్రజలను చూస్తే ఆ విషయం మీకే అర్ధం అవుతుంది. ప్రజలకు ప్రేమానురాగాలు తప్ప మరేమీ ఇవ్వలేదు. అందుకే నేను నామినేషన్ వేయడానికి బయలుదేరినప్పుడు కేవలం నామీద అభిమానంతో దాదాపు 40-50,000 మంది ప్రజలు తరలివచ్చారు. నా గెలుపుకు అదే మొదటి నిదర్శనంగా నిలుస్తుంది. నేను గెలిస్తే వారందరూ గెలిచినట్లే.  

ఇక్కడ ఒక విషయం చెప్పాల్సి ఉంది. నేను కేవలం టికెట్ కోసమే బిఎస్పీ ప్రతిపాదనను అంగీకరించలేదు. ఇంతకాలం తెరాస ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి బడుగు బలహీన వర్గాలంటే చాలా చులకన. ఎంత అంటే బాబాసాహెబ్ అంబేడ్కర్ పట్ల కూడా అనుచితంగా మాట్లాడే అంత. కనుక నేను బిఎస్పీ తరపున పోటీ చేసి గెలిస్తే దళితులు, బడుగు బలహీనవర్గాల ఆత్మగౌరవం నిలపవచ్చనే ఆలోచన కూడా నాలో ఉంది.

ఇక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ టిడిపి ఓట్లపై ఆధారపడలేదని అందరికీ తెలుసు. ఎందుకంటే, ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అయినప్పటికీ ప్రజలతో నాకున్న అనుబందం కారణంగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు నాకే ఓటేయబోతున్నారు. చివరికి నా ప్రత్యర్ధుల వెంట తిరుగుతున్నవారిలో కూడా నన్ను అభిమానిస్తున్నవారు చాలా మందే ఉన్నారు. వారు కూడా నాకే ఓటేయబోతున్నారు. ఈ సంగతి వారికీ తెలుసు కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మేమే గెలుస్తామని చెప్పుకొని తిరుగుతున్నారు. 

ఇక మహాకూటమిలో అన్ని పార్టీల నేతలు కూడా నాకే మద్దతు ఇస్తున్నారు. త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలు అందరూ వచ్చి నాకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈసారి వీలైతే రాహుల్ గాంధీ, కుంతియా తదితర పెద్దలను కూడా ఇబ్రహీంపట్నం తీసుకువచ్చి బహిరంగసభ నిర్వహింపజేయాలని ప్రయత్నిస్తున్నాను,” అని అన్నారు. 


Related Post