బిజెపి-తెరాస-కాంగ్రెస్‌ మూడు ముక్కలాట

November 27, 2018


img

ఎన్నికలు సమీపిస్తుండటంతో డిల్లీ నుంచి కాంగ్రెస్‌, బిజెపిల అగ్రనేతలు వచ్చి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. తెరాస-బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందని, ఈ ఎన్నికలలో తెరాస గెలిస్తే కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం ఏర్పాటుకు కేసీఆర్‌ సహకరిస్తారని కనుక తెరాసకు ఓటేస్తే బిజెపికి, మజ్లీస్ పార్టీలకు ఓట్లేసినట్లేనని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. 

ఇక బిజెపి జాతీయఅధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ వాదన మరొకలాగ ఉంది. కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విధేయుడని, కాంగ్రెస్‌-తెరాసలు రెండూ పైకి శత్రువులలాగా కొట్లాడుకొంటున్నప్పటికీ రెండుపార్టీల మద్య సంబంధాలున్నాయని వాదించారు. అందుకు ఉదాహరణగా కర్నాటకలో కాంగ్రెస్‌ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెడిఎస్ కు కేసీఆర్‌ మద్దతు ఇవ్వడాన్ని చూపుతున్నారు. 

విశేషమేమిటంటే ప్రధాని నరేంద్ర మోడీ అనుమతితోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన సంగతి అందరికీ తెలుసు. కానీ కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారని మోడీ ప్రశ్నిస్తున్నారు. గత నాలుగేళ్లలో కేసీఆర్‌-మోడీ మద్య ఏర్పడిన బలమైన బందాన్ని అందరూ చూశారు. నాలుగేళ్లలో కేసీఆర్‌ పాలనను మెచ్చుకొని కేంద్ర ప్రభుత్వమే అనేక అవార్డులు ఇచ్చింది. అలాగే కేసీఆర్‌ అడిగిందే తడువు జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి చేత ఆమోదముద్ర వేయించింది. కానీ ఇప్పుడు కేసీఆర్‌-సోనియాగాంధీలు కలిసి ప్రజలను మోసాగిస్తున్నారని మోడీ విమర్శించారు. మోడీ సభలో తెరాస కంటే కాంగ్రెస్ పార్టీ మీదే ఎక్కువ విమర్శలు చేసి దానిని ఓడించాలని గట్టిగా నొక్కి చెప్పడం గమనిస్తే ఆయన తెరాసను కాక కాంగ్రెస్‌ పార్టీని ఓడించడానికే రాష్ట్రానికి వచ్చినట్లనిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఒడితే గెలిచేదెవరు? అంటే సమాధానం అందరికీ తెలుసు.  

ఇక కేసీఆర్‌ వాదన మరొకలా ఉంది. కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ పనికిరాని పార్టీలేనని, వాటి వలన దేశానికి రాష్ట్రానికి ప్రయోజనం లేదని కనుక అసెంబ్లీ ఎన్నికల తరువాత వాటికి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కేసీఆర్‌ చెప్పుతున్నారు. కానీ గత నాలుగేళ్ళలో మోడీ ప్రభుత్వానికి నోట్లరద్దు, జిఎస్టి, అవిశ్వాస తీర్మానాలు వంటి ఏ చిన్నకష్టం వచ్చినా కేసీఆర్‌ ఏవిధంగా అండగా నిలబడ్డారో అందరికీ తెలుసు. తన పాలన, ప్రభుత్వ పని తీరు అద్భుతంగా ఉందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ తనను మెచ్చుకొన్నారని కేసీఆర్‌ చెప్పుకొన్నారు. కానీ ఇప్పుడు మోడీ తెలివి తక్కువవాడని కెసిఆర్ విమర్శిస్తున్నారు. అంటే మోడీ, కేసీఆర్‌ ఇద్దరూ కలిసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టం అవుతోంది. 

కఫ్యూజన్ ఏమీ లేదంటూనే మూడు పార్టీలు కలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఓట్లను రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే అదేదో సినిమాలో మహేశ్ బాబు చెప్పినట్లు మూడు పార్టీలు ప్రజలను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నిస్తే ఆ కన్ఫ్యూజ్ లో వారు ఏ పార్టీకి మెజారిటీ రాకుండా ఓట్లు వేసేసి మూడు పార్టీలను మూలన కూర్చోబెట్టే ప్రమాదం ఉంది. అప్పుడు నష్టపోయేది ఆ మూడు పార్టీలేనని గ్రహిస్తే మంచిది.


Related Post