మోడీ ఇంత తెలివి తక్కువ వాడనుకోలేదు : కేసీఆర్‌

November 27, 2018


img

మంగళవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, “ఐదేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ నేటికీ నిజామాబాద్‌లో కరెంటు లేదు. నీళ్ళు లేవు. కానీ కేసీఆర్‌ తన పాలన గురించి చాలా గొప్పలు చెప్పుకొంటున్నారు,” అని విమర్శించారు.

అంతకు ముందే నిజామాబాద్‌లో ప్రజాశీర్వాదసభను నిర్వహించి మహబూబ్‌నగర్‌ చేరుకొని సభలో మాట్లాడుతున్న కేసీఆర్‌కు ఈ విషయం తెలియడంతో, “ప్రధాని నరేంద్ర మోడీ ఇంత తెలివి తక్కువ వాడనుకోలేదు. ఆయనకు ఎవరు స్పీచ్ రాసిచ్చారో గానీ దానిని గుడ్డిగా చదివేశారు తప్ప దానిలో నిజానిజాలను నిర్ధారించుకోలేదు. నిజామాబాద్‌లో నేటికీ నీళ్ళు, కరెంటు లేవని విమర్శించడం సిగ్గుచేటు. కావాలంటే నేను ఇక్కడి నుంచే హెలికాప్టర్‌లో నిజామాబాద్‌ వస్తాను. ఆయన కూడా అక్కడకు వస్తే నేరుగా ప్రజలనే అడిగి తెలుసుకొందాము. ఆయనకు దమ్ముంటే నా సవాలును స్వీకరించాలి,” అని అన్నారు. 

“నాకు పరిపాలన చేతకాక 9 నెలల ముందుగా శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళానని మోడీ నాపై విమర్శలు చేశారు. నేను ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లానంటే...”అని మొదలుపెట్టిన కేసీఆర్‌ చటుక్కున మాట మార్చి, ప్రజాకూటమి దాని వెనుకున్న చంద్రబాబు నాయుడు, వారు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏమవుతుందో వివరిస్తూ మోడీ ప్రశ్నకు సమాధానం దాటవేశారు.


Related Post