ఆర్టీసీ కార్మికులకు శుభవార్త

November 26, 2018


img

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ (టిఎస్ఆర్టీసీ)ని లాభనష్టాలకు అతీతంగా నడిపించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుంది. మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము,” అని చెప్పారు. 

కొన్ని నెలల క్రితం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తమకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచాలని కోరుతూ సమ్మెకు సిద్దపడినప్పుడు, సిఎం కేసీఆర్‌ వారి పట్ల చాలా కటినంగా వ్యవహరించారు. ఒకవేళ సమ్మెకు దిగితే ఆర్టీసీ మూసివేయవలసి వస్తుందని, అప్పుడు నష్టపోయేది కార్మికులేనని కనుక అటువంటి ఆలోచన చేయవద్దని గట్టిగా హెచ్చరించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు కనీసం 25% పెంపు కోరగా ప్రభుత్వం 16% మద్యంతర భృతి ఇస్తామని హామీ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తితో సమ్మె విరమించారు. 

అయితే వారి జీతాల పెంపును ఆర్టీసీ నష్టాలతో ముడిపెట్టి చూస్తున్నందున వారికి ఇది శాస్విత సమస్యగా నిలిపోయింది. కనుక ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయమని వారు డిమాండ్ చేస్తున్నారు. దానిపై కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించింది కనుక లక్షలాది ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబాలు మహాకూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కనుక దీనిపై తెరాస కూడా తగిన రీతిలో స్పందించవచ్చు. ఒకవేళ తెరాస కూడా ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరించినట్లయితే, అప్పుడు మహాకూటమి, తెరాసలలో ఏది అధికారంలోకి వచ్చినా ఆర్టీసీ కార్మికులకే మేలే జరుగుతుంది. 


Related Post