అలాగైతే ఉత్తమ్‌కు ఓటేయాలంటే ఆలోచించాల్సిందే!

November 26, 2018


img

తెరాస అధినేత కేసీఆర్‌, మంత్రి కేటిఆర్‌ ‘రాజకీయ సన్యాసం’ మాటలు ప్రతిపక్షపార్టీలకు ఒక ఆయుధంగా లభించినప్పుడు మహాకూటమి నేతలు మూకుమ్మడిగా వారిరువురిపై ఏవిధంగా దాడి చేశారో అందరూ చూశారు. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ అవకాశం తెరాస, బిజెపి నేతలకు ఇచ్చారు. 

ఆదివారం హుజూర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “      హుజూర్‌నగర్‌ ప్రజలపై నాకు అపారమైన నమ్మకం ఉంది. వారు నన్ను కనీసం 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని నమ్ముతున్నాను. ఒకవేళ అంతా మెజార్టీ రాకపోతే నేను గెలిచినా వెంటనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను,” అని అన్నారు. 

అయితే ఆయన నిజంగా అన్నంత పనీ చేస్తారనుకొంటే ఆయనకు ఓటేయడానికి హుజూర్‌నగర్‌ ప్రజలు ఆలోచించుకోవలసిందే. అంత మెజార్టీ రాకపోతే రాజీనామా చేస్తానంటున్నారు కనుక ఆయనను గెలిపించినా వారి ఓట్లు మురిగిపోతాయి. కనుక గెలిచిన తరువాత ‘రాజీనామా చేయని’ మా పార్టీ అభ్యర్ధికే ఓటేయమని తెరాస, బిజెపి, బిఎల్ఎఫ్ తదితర పార్టీలు కోరినా ఆశ్చర్యం లేదు. కనుక ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకొన్న ఈ సమయంలో అన్ని పార్టీల అభ్యర్ధులు ‘రాజీనామా లేదా రాజకీయ సన్యాసం’ మాటలను ఉపయోగించకుండా ఉంటే మంచిది.         



Related Post