అవి గెలిస్తే రాష్ట్రంలో కర్ణాటక పరిస్థితులే...బిజెపి

November 26, 2018


img

బిజెపి నేత జీవిఎల్ఎన్ రావు తెరాస, మజ్లీస్, మహాకూటమిని ఉద్దేశ్యించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌, టిడిపి, తెరాస, మజ్లీస్ పార్టీలు నాలుగు ఎన్నికలలో కొట్లాడుకొంటున్నట్లు నటిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నాయి. కానీ ఆ నాలుగు పార్టీలు ఒక తానులో ముక్కలే. ఒకవేళ ఈ ఎన్నికలలో తెరాస లేదా మహాకూటమి గెలిచినట్లయితే, ఎన్నికల తరువాత అవి కలిసిపోయి తమకు ఓటేసి గెలిపించిన ప్రజలను చూసి నవ్వుకొంటాయి. 

అందుకు తాజా ఉదాహరణగా మన ముందు కర్ణాటక ఎన్నికలున్నాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్, జెడిఎస్ పార్టీల నేతలు ఒకరినొకరు నోరారా తిట్టుకొన్నారు. కానీ ఎన్నికలవగానే రెండు పార్టీలు చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. రేపు తెలంగాణలో కూడా అదే జరుగబోతోంది. తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి వద్దనుకొంటే మోడీ నేతృత్వంలో దేశాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తున్న బిజెపికే ఓటేసి గెలిపించాలి,” అని అన్నారు. 

నేటి రాజకీయాలలో వాస్తవాల కంటే మాటకారితనంతో పందిని చూపి నంది అని ప్రజలను ఒప్పించగలవాడే గొప్ప నాయకుడిగా చలామణి అవుతున్నాడు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా అదే ప్రయత్నం జరుగుతోందని చెప్పవచ్చు. 

నిజానికి తెరాసకు బిజెపికి మద్య రహస్య సంబందం అవగాహన ఉన్నాయని, ఎన్నికల తరువాత కేంద్రంలో మళ్ళీ మోడీ అధికారంలోకి రావడానికి సిఎం కేసీఆర్‌ పూర్తి మద్దతు ఇవ్వబోతున్నారని, ఆ ఒప్పందం ప్రకారమే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు మోడీ అనుమతించారని ఊహాగానాలు వినిపిస్తుంటే, ఎన్నికల తరువాత కాంగ్రెస్‌, తెరాస, టిడిపి, మజ్లీస్ పార్టీలు కలిసిపోతాయని జీవిఎల్ఎన్ రావు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత మంది ఎమ్మెల్యేలు లేకపోయినప్పటికీ కాంగ్రెస్‌ లేదా జెడిఎస్ ఎమ్మెల్యేలకు పదవులు ఎరజూపి ఆకర్షించవచ్చుననే ధీమాతో గవర్నరుపై ఒత్తిడి తెచ్చి ఎడ్యూరప్ప హడావుడిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి, అసెంబ్లీలో బలం నిరూపించుకోలేక 48 గంటలలో ఆ కుర్చీలో నుంచి దిగిపోయారనే సంగతి అందరికీ తెలుసు. అలాగే గోవా, మిజోరాం లో బిజెపి ఏమి చేసిందో అందరికీ తెలుసు. కనుక మాటకారితనంతో ప్రజలను నమ్మించవచ్చు కానీ నిజాలను ఎవరూ దాచలేరు.         

ఒకవేళ తెరాస గెలిచి మహాకూటమి ఓడిపోతే, ఎప్పటిలాగే ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్‌, టిడిపి, టిజేఎస్ ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింపజేయవచ్చు. ఒకవేళ మహాకూటమి గెలిస్తే తెరాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించవచ్చు. ఇక మజ్లీస్ పార్టీ ఎప్పటిలాగే ఆ రెంటిలో ఏది గెలిస్తే దానికి తోక పార్టీగా మారవచ్చు. కనుక రాష్ట్రంలో మళ్ళీ ఫిరాయింపు రాజకీయాలు వద్దనుకొన్నట్లయితే తెలంగాణ ప్రజలు బిజెపికే ఓటేసి గెలిపించాలని కోరుకొంటే సహేతుకంగా ఉండేది.


Related Post