వంటేరు ఓటమిని అంగీకరించారా?

November 26, 2018


img

మహాకూటమిలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా గజ్వేల్ నుంచి సిఎం కేసీఆర్‌పై పోటీకి దిగిన వంటేరు ప్రతాప్ రెడ్డి అప్పుడే ఓటమి అంగీకరించారా అంటే అవుననే అనిపిస్తోంది. గజ్వేల్ లో పోలీసులు, ఎన్నికల అధికారులు తెరాస ఏజంట్ల వలె వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన నిన్న గజ్వేల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు నిరాహార దీక్షకు కూర్చోన్నారు. నిజానికి సిఎం కేసీఆర్‌పై పోటీ అంటే ఓటమిని సిద్దపడి బరిలో దిగినట్లేనని వేరే చెప్పనవసరంలేదు. ఆ విషయం వంటేరుకు కూడా బాగా తెలుసు. కానీ ఆయన గజ్వేల్ కు చెందినవారు కనుక అక్కడి నుంచే బరిలో దిగవలసి వచ్చింది. 

ఎలాగూ బరిలో దిగారు కనుక ముందుగా గజ్వేల్ నియోజకవర్గంలో ముమ్మురంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న హరీష్ రావును బయటకు పంపించే ప్రయత్నంలో ‘కేసీఆర్‌ను ఓడించడానికి హరీష్ రావు తనకు ఆర్ధికసహాయం చేస్తానని చెప్పారని, కానీ తాను నిరాకరించానని, త్వరలోనే హరీష్ రావు తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని వంటేరు ప్రకటించారు. కానీ ఆ వ్యూహాన్ని హరీష్ రావు గట్టిగా త్రిప్పి కొట్టడంతో ఇక చేసేదేమీ లేక వంటేరు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. చివరి అస్త్రంగా నిరాహారదీక్షకు కూర్చొన్నట్లు భావించవచ్చు. 

ఇక తెరాస విషయానికి వస్తే, సిఎం కేసీఆర్‌ వంటి అత్యంత ప్రజాధారణ ఉన్న గొప్ప నాయకుడికి ఆయన స్వంత నియోజకవర్గంలోనే ఇంత ఉదృతంగా ఎన్నికల ప్రచారం అవసరమా? కేసీఆర్‌పై అభిమానంతో గజ్వేల్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారనే  నమ్మకం లేకనే తెరాస ఇంత ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేస్తోందా? లేక చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు ప్రచారం చేస్తోందా? అంటే చిన్నపాము-కర్ర అని సమాధానం అనుకోవాలేమో?

తెరాసకు ఈ స్థాయిలో ఎన్నికల ప్రచారం పరిపాటే కానీ కేసీఆర్‌వంటి అత్యంత ప్రజాధారణ ఉన్న అగ్రనేతపై పోటీకి సిద్దపడిన వంటేరు ప్రతాప్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి వంటి అగ్రనేతలు అండగా నిలబడి ఉండి ఉంటే బాగుండేది. కానీ వారందరూ తమతమ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారంలో మునిగిపోయున్నారు. ఎందుకంటే అక్కడా వారికి తెరాస నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. కనుక రాహుల్ గాంధీ చేత గజ్వేల్ లో బహిరంగసభ నిర్వహింపజేసినా వంటేరుకు గొప్ప మేలు చేసినట్లుండేది. కానీ అగ్రనేతలు పోటీ చేస్తున్న కొడంగల్‌, మధిరలో రాహుల్ గాంధీ చేత బహిరంగసభలు నిర్వహింపజేసుకొంటూ వంటేరు వంటి అభ్యర్ధులకు అన్యాయం చేస్తున్నారని చెప్పవచ్చు.


Related Post