తాజా సర్వే అస్త్రం దేనికంటే...

November 26, 2018


img

సిఎం కేసీఆర్‌ నిన్న తాండూరు, పరిగి, ఇబ్రహీంపట్నం, షాద్‌ నగర్‌, నారాయణపేట, దేవరకద్రలలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పరిగిలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈసారి ఎన్నికలలో తెరాస చరిత్ర సృష్టించబోతోంది. తాజా సర్వే ప్రకారం తెరాస 103-108 సీట్లు వస్తాయని తేలింది. పోలింగ్ తేదీనాటికి ఈ సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు,” అని చెప్పారు. 

మేడ్చల్ సభలో ఒకే వేదికపైకి వచ్చిన మహాకూటమిలో నాలుగు పార్టీల నేతలు ‘కేసీఆర్‌, కేటిఆర్‌ రాజకీయ సన్యాసం ప్రకటనల’ గురించి గట్టిగా మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్‌ నేతలు అందరూ తమ ఎన్నికల ప్రచారంలో మరిచిపోకుండా ఈ విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పడం మొదలుపెట్టారు. 

కేసీఆర్‌, కేటిఆర్‌ తాము గెలిచి తీరుతామనే ధీమాతోనే ‘రాజకీయ సన్యాసం’కు రెడీ అన్నట్లు మాట్లాడినప్పటికీ ఆ మాటలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపడమే కాకుండా కీలకమైన ఎన్నికల సమయంలో మహాకూటమిలో పార్టీలకు బలమైన ఆయుధం అందించిందని కేసీఆర్‌ గ్రహించారు. బహుశః అందుకే కేసీఆర్‌ మళ్ళీ సర్వే అస్త్రం ప్రయోగించి నష్టనివారణకు ప్రయత్నించినట్లు భావించవచ్చు. 

అయితే తెరాసకు మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్ పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ మొన్న హైదరాబాద్‌ పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ “మా మద్దతు లేనిదే రాష్ట్రంలో ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు. అధికారం కావాలంటే కేసీఆర్‌ అయినా మరెవరైనా మాకు సలాం చేయవలసిందే,” అని అన్నారు. అంటే తెరాసకు ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడినన్ని సీట్లు రావనే కదా అర్ధం? 

ఓవైసీల అభిప్రాయాలు, కేసీఆర్‌ సర్వేలను పక్కనబెట్టి వాస్తవిక దృష్టితో చూసినట్లయితే ఈసారి ప్రతిపక్ష పార్టీల నుంచి ఇంత గట్టి పోటీ ఉన్నప్పుడు తెరాస 103-108 సీట్లు సాధించడం అసాధ్యమేనని అర్ధం అవుతుంది. కానీ సిఎం కేసీఆర్‌ చెపుతున్నట్లుగా తెరాసకు 103-108 సీట్లు సాధించగలిగితే అది పూర్తిగా సిఎం కేసీఆర్‌ గొప్పదనమే అవుతుంది. ఆయన మాటకు, సర్వేలకు మరింత విశ్వసనీయత ఏర్పడుతుంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. ఎవరి మాటలు నిజమవుతాయో తెలియాలంటే డిసెంబరు 11వ తేదీ వరకు ఎదురుచూడక తప్పదు.


Related Post