సెంటిమెంటుని సెంటిమెంటుతోనే...

November 25, 2018


img

ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు, తెరాస ప్రయోగిస్తున్న ‘తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం సెంటిమెంటు’ను కాంగ్రెస్ పార్టీ కూడా ‘తెలంగాణ తల్లి సెంటిమెంటు’తోనే అడ్డుకొని తెరాసపై పైచెయ్యి సాధించాలని ప్రయత్నిస్తున్నట్లు మేడ్చల్ సభతో స్పష్టమైంది. 

గత రెండున్నర నెలలుగా తెరాస ఎన్నికల ప్రచారంలో మహాకూటమికి ఓటేసి గెలిపిస్తే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అటు డిల్లీలో కాంగ్రెస్‌ పెద్దల కాళ్ళ దగ్గర, అమరావతిలో చంద్రబాబు నాయుడు వద్ద తాకట్టు పెట్టిన్నట్లేనని గట్టిగా వాదిస్తున్నారు. తమ అధిష్టానం అనుమతి లేనిదే తమంతట తాముగా పార్టీ అభ్యర్ధులను కూడా ఖరారు చేయలేని దుస్థితిలో ఉన్న  కాంగ్రెస్‌, టిడిపిలకు, అలాగే టికెట్ల కోసం రాహుల్, సోనియా, చంద్రబాబుల చుట్టూ ప్రధాక్షిణాలు చేసిన  టిజేఎస్, సిపిఐలకు అధికారం కట్టబెడితే, తెలంగాణ ప్రభుత్వం అటు డిల్లీ ఇటు అమరావతి నుంచి నడిపించబడుతుందని తెరాస వాదిస్తోంది. కనుక మహాకూటమిని గెలిపిస్తే మళ్ళీ చేజేతులా పరాయిపాలనను కొనితెచ్చుకొన్నట్లేనని తెరాస నేతలు గట్టిగా వాదిస్తున్నారు. వారి వాదన సహేతుకంగానే ఉంది కనుక అది ప్రజలకు బాగానే చేరుతోంది. 

తెరాస చేస్తున్న ఈ వాదనకు నేటికీ కాంగ్రెస్‌, టిడిపి నేతలు సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు. కానీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం పేరుతో తెరాస రాజేస్తున్న ఈ సెంటిమెంటుకు సమాధానం మాత్రం కనిపెట్టగలిగారు. అదే...సోనియాగాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణిస్తూ ఆమె రుణం తీర్చుకోవాలని గట్టిగా నొక్కి చెప్పడం. మేడ్చల్ సభలో కాంగ్రెస్‌ నేతలందరూ అదే చేశారు. చివరకి టిజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌ సైతం ‘ఆనాడు తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ పడిన పురిటినొప్పులను తాను స్వయంగా చూశానని కనుక ఆమె రుణం తీర్చుకోవలసిన సమయం ఆసన్నమైందని’ చెప్పడం విశేషం. 

మేడ్చల్ సభలో సోనియాగాంధీ కూడా తెలంగాణ ఏర్పాటుకు తాను ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నారో..ఎన్ని త్యాగాలు చేశారో చాలా చక్కగా భావోద్వేగంతో చెప్పి ప్రజలను ఆకట్టుకోగలిగారు. ‘తెలంగాణ తల్లి సెంటిమెంటు’ బాగానే ఉంది కానీ దానితో ప్రజలను మెప్పించడం కష్టమే. మెప్పించాలంటే ముందుగా తెరాస వాదనలకు మహాకూటమి నేతలు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.


Related Post