సోనియమ్మా ఇప్పుడు ఆ ఊసేందుకమ్మా?

November 24, 2018


img

మేడ్చల్ కాంగ్రెస్‌ సభ విజయవంతం అయ్యింది. భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. మహాకూటమిలో అన్ని పార్టీల నేతలు తరలివచ్చి తమ ఐక్యతను చాటి చెప్పారు. ఇక సభలో మాట్లాడిన కాంగ్రెస్‌ నేతలు, మిత్రపక్షాల నేతలు         తెరాస పాలనను, సిఎం కేసీఆర్‌ను గట్టిగా ఏకేశారు. సోనియాగాంధీని ‘తెలంగాణ తల్లి’గా చాలా చక్కగానే వర్ణించి ఆమె దయ వలననే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, దాని కోసం ఆమె పడిన పురిటినొప్పులు గురించి గొప్పగా వర్ణించారు. 

ఇక సోనియాగాంధీ కూడా అదే లైన్లో మాట్లాడుతూ “మళ్ళీ చాన్నాళ్ళ తరువాత తెలంగాణ ప్రజలను చూస్తుంటే నా బిడ్డలను చూస్తున్నంత ఆనందగా ఉందంటూ” చక్కగా భావోద్వేగాలు ప్రదర్శించారు. ఆమె తరువాత మాట్లాడిన రాహుల్ గాంధీ కూడా కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు. వారి ప్రసంగాలు విని జనం కూడా బాగానే చప్పట్లు కొట్టారు. 

అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పకుండా ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతామని సోనియాగాంధీ ప్రకటించడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. బహుశః తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలను ఆకట్టుకోవడానికేనని ఆమె ఆవిధంగా అన్నారని సర్ధిచెప్పుకొన్నా, దానితో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురియ్యే ప్రమాదం ఉంటుందనే సంగతి ఆమె మరిచినట్లున్నారు. 

ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని తెరాస చాలా కాలంగా వాదిస్తోంది. కేసీఆర్‌, కేటిఆర్‌ ‘రాజకీయ సన్యాసం’ వ్యాఖ్యలతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న తెరాసకు నిన్న సోనియాగాంధీ ప్రత్యేకహోదా ప్రకటనతో చాలా బలమైన ఆయుధం అందించారని చెప్పవచ్చు. 

ఈ అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకొన్న తెరాస ఎంపీ కవిత మాట్లాడుతూ, “సోనియాగాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చి రాష్ట్రానికి ఏమి చేస్తారో చెప్పి ఉంటే బాగుండేది కానీ ఆమె తెలంగాణకు నష్టం కలిగించేవిధంగా పొరుగు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు. ఆమె తెలంగాణ హక్కులు, ప్రయోజనాల గురించి మాట్లాడకుండా, చంద్రబాబు నాయుడు వ్రాసిచ్చిన స్క్రిప్టును చదవడం బాధాకరం. తెరాస ఎక్కడ ఉన్నా...ఏ పరిస్థితులలో ఉన్నా తెలంగాణ హక్కులు, ప్రయోజనాల గురించే మాట్లాడుతుంది. వాటి కోసమే పోరాడుతుంటుంది,” అని అన్నారు.


Related Post