బీసీలకు కృష్ణయ్య హ్యాండ్?

November 24, 2018


img

ఆర్.కృష్ణయ్య...ఒకప్పుడు నిఖార్సయిన బీసీ సంఘాల నేత. కానీ 2014 ఎన్నికలలో టిడిపి అభ్యర్ధిగా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి గెలిచినప్పటి నుంచి ఆయన పక్కా రాజకీయ నాయకుడిగా మారిపోయినట్లు కనబడుతున్నారు. తన ఆశయమైన బీసీల సంక్షేమం కంటే, ఎమ్మెల్యేగా కొనసాగడమే ప్రధానాశయంగా మారినట్లుంది. అందుకే ఈసారి టిడిపి నుంచి టికెట్ లభించకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యి మిర్యాలగూడ నుంచి టికెట్ సంపాదించుకొన్నారు. విశేషమేమిటంటే, ఆయనకు కాంగ్రెస్‌ టికెట్ ఖరారు కాకమునుపు అన్ని పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపిస్తూ నవంబరు 17నా రాష్ట్ర బంద్ కు కూడా పిలుపు ఇచ్చారు. కానీ టికెట్ వస్తుందని తెలిసిన తరువాత బంద్ ఆలోచన విరమించుకొన్నారు. అంటే ఆయన పోరాడుతున్నది బీసీల రాజ్యాధికారంలో భాగం కోసమా లేక తన టికెట్ కోసమా? అనే సందేహం కలిగితే తప్పులేదు.   

నిజమే...బీసీల కోసం పోరాడాలంటే చేతిలో ఎంతో కొంత అధికారం ఉండటం చాలా అవసరమే. కనుక బీసీలకు-60, ఎస్సీలకు-28, ఎస్టీలకు-15, ముస్లింలకు-10, ఓసీలకు-6 సీట్లు కేటాయించి బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేసిన బహుజన లెఫ్ట్‌ పార్టీ (బిఎల్ఎఫ్)లో చేరి కృష్ణయ్య పోటీ చేయవచ్చు. తద్వారా ఆ పార్టీలో మరికొందరు బీసీ అభ్యర్ధులకు విజయావకాశాలు పెరిగి ఉండేవి. కానీ కృష్ణయ్య బిఎల్ఎఫ్ వైపు కనీసం కన్నెత్తి చూడలేదు. దానికి మద్దతు పలుకలేదు. 

ఎందుకంటే, రాష్ట్రంలో ఈసారి పోటీ ప్రధానంగా తెరాస-మహాకూటమి మద్యనే ఉంటుంది కనుక వాటిలో ఏదో ఒక దానిలో చేరి టికెట్ సంపాదించుకొంటేనే ఎమ్మెల్యే కాగలనని భావించడమే. ఈసారి కాంగ్రెస్‌ టికెట్ సంపాదించుకొన్నారు కనుక నిన్న మేడ్చల్ బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీకి, సోనియమ్మకు జై కొడుతూ గట్టిగా మాట్లాడారు. అయితే కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చినప్పటికీ 2014ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించారు? అప్పుడే తాను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరలేదు? అని కృష్ణయ్య ఆలోచించినట్లు లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల...కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావల అంటూ అచ్చమైన కాంగ్రెస్‌ నాయకుడిలా మాట్లాడారు. 

నిన్న ఆయన మాటలు విన్నవారు “ఆయన ఆశయం ఇదేనా?” అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే తరువాత మంత్రి పదవి సాధించడం ఆయన ఆశయమేమో? అంటున్నవారు కూడా ఉన్నారు. అయితే ఆయన (బీసీ నేత) ఎమ్మెల్యేగా... ఆ తరువాత మంత్రిగా ఎదిగితే బీసీలకు న్యాయం జరిగిపోయినట్లేనా? మరి బీసీలకు ఎవరు ఎప్పుడు ఏవిధంగా న్యాయం చేస్తారు? వారికి రాజ్యాధికారం ఎవరు కల్పిస్తారు? అనే ప్రశ్నలకు ఆర్.కృష్ణయ్య సమాధానం చెప్పాలి.


Related Post