మల్ రెడ్డి రంగారెడ్డికి ఇక తిరుగులేదు

November 24, 2018


img

అనేక దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కొందరు సీనియర్ నేతలు మహాకూటమిలో పొత్తులలో భాగంగా తమ సీట్లను త్యాగాలు చేయవలసి వచ్చింది. అటువంటి వారిలో సీనియర్ నాయకుడు మల్ రెడ్డి రంగారెడ్డి కూడా ఒకరు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ప్రజలకు ఆయన చిరపరిచితులు. ఆయనకు వారి సమస్యలు, అవసరాలు పట్ల పూర్తి అవగాహన ఉంది. అలాగే ప్రతీ బూత్ స్థాయి కాంగ్రెస్‌ కార్యకర్తలతో ఆయనకు మంచి పరిచయాలున్నాయి. కనుక ఆయనకే టికెట్ లభిస్తుందని అందరూ భావించారు. కానీ మహాకూటమిలో పొత్తులలో భాగంగా ఆ సీటును కాంగ్రెస్ పార్టీ టిడిపికి కేటాయించింది. 

కానీ అసలు కారణం వేరే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఒక గ్రూపు ఆయనకు టికెట్ రాకుండా చేసేందుకు తెర వెనుక చక్రం తిప్పడంతో ఆయనకు చివరి నిమిషంలో అంటే 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్లు గడువు ముగుస్తుందనగా, మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూడా ఆయనకు టికెట్ ఇస్తుందా లేదా అనే విషయం కాంగ్రెస్‌ పెద్దలు తేల్చి చెప్పలేదు. కనుక ఆయన బి-ఫాం వస్తుందనే నమ్మకతోనే సుమారు 20-30, 000 మందితో ఊరేగింపుగా పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. కానీ మహాకూటమి పొత్తులలో భాగంగా ఇబ్రహీంపట్నం  టికెట్ టిడిపికి కేటాయించవలసి వచ్చిందని కనుక ఆయనకు టికెట్ ఇవ్వలేకపోతున్నామని కాంగ్రెస్‌ పెద్దలు చెప్పడంతో ఆయన షాక్ అయ్యారు.

కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట వంటి ఇబ్రహీంపట్నం టికెట్ ను టిడిపి అభ్యర్ధికి కేటాయించడం అంటే తెరాసను గెలిపించడమేనని వేరే చెప్పనవసరం లేదు. 

అయితే ఈసారి ఇబ్రహీంపట్నంలో తన సత్తా ఏమిటో నిరూపించి చూపాలనే పట్టుదలతో తాను బిఎస్పీ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. అయితే ఆయన చాలా మంచి నిర్ణయమే తీసుకొన్నారని ఇప్పుడు రుజువు అయ్యింది. 

ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలనుకొన్న సామా రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం నుంచి టిడిపి టికెట్ కేటాయించడంతో ఆయన కూడా షాక్ అయ్యారు. తనకు ఏమాత్రం పరిచయం లేని ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేయాలా వద్దా అనే డైలెమాలోనే ముందుకు సాగుతున్నారు. దాంతో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు కూడా కాంగ్రెస్‌ కార్యకర్తలకు, పార్టీ ప్రచారకమిటీ నేతలకు మల్ రెడ్డి రంగారెడ్డిని కాంగ్రెస్‌ అభ్యర్ధిగానే భావించి ఆయనకు పూర్తి మద్దతు సహాకారం అందించాలని బహిరంగంగానే కోరారు. దీంతో మల్ రెడ్డి రంగారెడ్డికి ఇబ్రాహీంపట్నంలో పూర్తిగా లైన్ క్లియర్ అయిపోయింది. అనూహ్యంగా, ఇప్పుడు మహాకూటమిలో కాంగ్రెస్‌ పార్టీతో పాటు బిఎస్పీ మద్దతు కూడా లభిస్తుండటంతో ఇబ్రహీంపట్నం నుంచి తెరాస అభ్యర్ధిని అవలీలగా ఓడించగలనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Related Post