బెడిసికొట్టిన రాజకీయ సన్యాసం

November 24, 2018


img

రాజకీయ నాయకులు తమ ప్రత్యర్ధులపై పైచెయ్యి సాధించడానికి ‘రాజకీయ సన్యాసం’ అస్త్రాన్ని ప్రయోగిస్తుంటారు. కానీ ఒక్కోసారి అదే అస్త్రంతో దానిని ప్రయోగించినవారే దెబ్బ తింటుంటారు. ఉదాహరణకు ఈసారి ఎన్నికలలో 100 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తామని, రాలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి కేటిఆర్‌ చెప్పారు. ఒకవేళ మహాకూటమి ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు కూడా రాజకీయ సన్యాసం చేస్తారా? అని కేటిఆర్‌ సవాలు విసిరారు. ఆ సవాలుకి వారు కూడా సై అన్నారు. అయితే కాంగ్రెస్‌, తెరాస నేతలు ఈ సవాళ్ళకు కట్టుబడి ఉంటారా లేదా? అనేది అప్రస్తుతం. 

కానీ మొన్నటి వరకు 100 సీట్లకు పైగా సాధిస్తామని గట్టిగా వాదించిన మంత్రి కేటిఆర్‌ తాజాగా ‘మా అంతట మేముగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తా’నని తన సవాలుకు చిన్న సవరణ చేశారు. అంటే ‘ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని సీట్లు మాత్రమే గెలుచుకోగలమనే’ అర్ధం అందులో కనబడుతోంది. ఇది కూడా అప్రస్తుతమే. 

కానీ ఇటీవల సిఎం కేసీఆర్‌, “నేను ఓడిపోతే నాకేమీ నష్టం లేదు. రాష్ట్రానికి, ప్రజలకే నష్టం. నేను నా ఫాంహౌసుకు వెళ్ళి పడుకొంటాను,” అని అన్న మాటలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపాయని చెప్పక తప్పదు. ఆయన ఏ ఉద్దేశ్యంతో ఆ మాటలు అన్నప్పటికీ మహాకూటమి నేతలందరూ వాటిని అందిపుచ్చుకొని తెరాసపై ఎదురుదాడి ప్రారంభించారు. యుద్ధానికి ముందే కేసీఆర్‌ ఓటమిని అంగీకరించారని, అందుకే తండ్రీకొడుకులు ఇద్దరూ అప్పుడే రాజకీయ సన్యాసం గురించి మాట్లాడుతున్నారని మహాకూటమి నేతలు నిన్న మేడ్చల్ సభలో గట్టిగా నొక్కి చెప్పారు. 

కోదండరామ్‌ మరో అడుగు ముందుకువేసి కేసీఆర్‌కు ఓటేసినా ఫాంహౌసులో పడుకొంటారు. వేయకపోయినా ఫాంహౌసులో పడుకొంటారు. కనుక గద్దె దిగి ఇంటికి వెళ్లిపోతున్నవారికి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదు. తెరాసకు ఓటు వేస్తే అది మురుగుగుంటలో వేసినట్లే..అది మురిగిపోతుంది,” అని అన్నారు. 

తమ ‘రాజకీయ సన్యాసం’ సవాళ్ళ వలన ఆశించిన ఫలితం రాకపోగా, కీలకమైన ఈ సమయంలో మహాకూటమికి బలమైన ఆయుధం అందజేసిందని గ్రహించిన మంత్రి కేటిఆర్‌ నష్టనివారణకు పూనుకొన్నారు. 

ఆయన నిన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “మాకు ప్రజల నాడి బాగా తెలుసు. ఆనాడు గ్రేటర్ ఎన్నికలలో ఏమి జరిగిందో అదే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలలో పునరావృతం కాబోతోంది. మేము ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉండబట్టే మేము ఇటువంటి ఛాలెంజ్ చేయగలుగుతున్నాము. కానీ కాంగ్రెస్‌ నేతలలో ఎవరికీ మా సవాలును స్వీకరించే దమ్ము, ధైర్యం లేదు. అందరూ ఏవో కుంటిసాకులు చెప్పి తప్పించుకొంటున్నారు. డిసెంబరు 11న ఏమి జరుగబోతోందో ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా కాంగ్రెస్‌ నేతలందరికీ ఖచ్చితంగా తెలుసు. తాము ఓడిపోతామని వాళ్ళకు బాగా తెలిసి ఉన్నప్పటికీ చాలా గొప్పగా బిల్డప్ ఇస్తున్నారు. అయితే ఎవరు ఏమి చెప్పినా ఈ ఎన్నికలలో గెలిచేది మేమే. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే. ఆ నమ్మకంతోనే మేము ఇటువంటి సవాలు విసురుతున్నాము. దమ్ముంటే మహాకూటమి నేతలు ఇప్పటికైనా మా సవాలు స్వీకరించాలి,” అని అన్నారు.


Related Post