కేసీఆర్‌కు శుభాకాంక్షలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

November 23, 2018


img

‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీయనని’ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శపధం చేస్తే, ‘ఇక ఆయన జీవితంలో ఎన్నడూ గడ్డం తీసుకోవలసిన అవసరం ఉండదు’ అని కేసీఆర్‌, కేటిఆర్‌ చలోక్తులు విసిరారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ అవకాశం వచ్చింది. నిన్న ఖానాపూర్ సభలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, ‘తెరాస ఓడిపోతే నాకేం నష్టం లేదు. ఇంటికి పోయీ హాయిగా రెస్ట్ తీసుకొంటా...వ్యవసాయం చేసుకొంటా’నని అన్నారు. 

కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ “రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్న కేసీఆర్‌గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికలలో తెరాస ఎలాగూ ఓడిపోతుంది. అప్పుడు కేసీఆర్‌ తన ఫాంహౌసుకి, కేటిఆర్‌ అమెరికాకు వెళ్లిపోక తప్పదు,” అని అన్నారు. 

రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి తదితర కాంగ్రెస్‌ నేతలు కూడా ‘కేసీఆర్‌కు అప్పుడే ఓటమి భయం పట్టుకొంది. అందుకే ఇంకా ఎన్నికలకు వెళ్ళక ముందే తండ్రీకొడుకులు ఇద్దరూ రాజకీయ సన్యాసం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఇవాళ్ళ మేడ్చల్ లో జరుగబోతున్న బహిరంగసభకు సోనియాగాంధీ వస్తారని తెలిసినప్పటి నుంచి కేసీఆర్‌తో సహా తెరాస నేతలందరిలో ఆందోళన మొదలైంది. తెలంగాణ ఇచ్చిన ఆమెను చూసి ప్రజలందరూ ఎక్కడ మహాకూటమివైపు వెళ్ళిపోతారోనని కేసీఆర్‌ ఆందోళన చెందుతున్నట్లు ఆయన ‘రాజకీయ సన్యాసం’ మాటలే చెపుతున్నాయి. కేసీఆర్‌, కేటిఆర్‌ ఇన్ని రోజులు తమ మాటల గారడీతో రోజులు వెళ్ళబుచ్చారు. వారి ముసుగులు తొలగిపోయాయి. ప్రజలకు వారిపై ఉన్న భ్రమలు తొలగిపోయాయి. కనుక కేసీఆర్‌కు ఇక కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. డిసెంబరు 7వ తేదీన ఆయన నిరంకుశ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించబోతోంది,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 


Related Post