మా పరిపాలన ఎట్లుందో మీరే నిర్ణయించండి: కేసీఆర్‌

November 23, 2018


img

సిఎం కేసీఆర్‌ ఇవాళ్ళ మధ్యాహ్నం నర్సంపేటలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, “గత 58 ఏళ్ళలో ఏ ప్రభుత్వమూ చేయలేనన్ని అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలు మేము అమలుచేశాం. అవన్నీ మీ ఊళ్ళలోనే మీ కళ్ల ముందే ఉన్నాయి. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేతన్నలు, భోధకాలు వ్యాధిగ్రస్తులు నెలనెలా టంచనుగా పెన్షన్లు అందుకొంటున్నారు. కళ్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్స్, కంటివెలుగు, రైతు బందు, రైతు భీమా వంటి సంక్షేమ పధకాలలో లబ్దిపొందినవారు కూడా మీలోనే ఉన్నారు. కనుక వాటి గురించి నేను మీకు మళ్ళీ వివరించనవసరం లేదు. అసలు ఇటువంటి పధకాలు ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా ప్రవేశపెడుతుందని, అమలుచేస్తుందని ఎవరైనా అనుకొన్నారా? కానీ అన్ని అమలవుతున్నాయంటే అర్ధం ఏమిటి? ఈ ప్రభుత్వం మీ అందరి సంక్షేమం కోసమే అహర్నిశలు ఆలోచిస్తోందని, పనిచేస్తోందని స్పష్టం అవుతోంది.

ఆలాగే తెలంగాణ ఏర్పడక మునుపు మీ ఊళ్ళు వాటిలో రోడ్లు, మురుగు కాలువలు, విద్యావైద్య సౌకర్యాలు ఏవిధంగా ఉండేవో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈ నాలుగేళ్ళలో మీ ఊళ్ళు రూపురేఖలు ఏవిధంగా మారిపోయాయో మీరే చూస్తున్నారు. తెలంగాణ ఏర్పడక మునుపు ఊళ్ళలోనే కాదు...రాజధాని హైదరాబాద్‌లో కూడా కరెంటు ఉండేది కాదు. కానీ ఇప్పుడు మారుమూల గ్రామాలలో కూడా 24 గంటలు కరెంటు ఉందన్న సంగతి మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో రైతులందరికీ 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న రాష్ట్రం దేశంలో మన రాష్ట్రం మాత్రమే. 

కనుక ఈ నాలుగేళ్ళలో మేము చేసిన ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నిటి గురించి ఒకసారి మీరే ఆలోచించుకొని మా ప్రభుత్వ పనితీరు బాగుందో లేదో నిర్ణయించుకోండి. మా పనితీరు బాగుందంటే తప్పకుండా మాకే ఓటేయండి లేకుంటే మీకు నచ్చిన పార్టీకి ఓటేసుకోండి,” అని కేసీఆర్‌ అన్నారు. 

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు ఏవైనా తాము గొప్పగానే పాలన చేశామని చెప్పుకొంటుంటాయి. అయితే ‘మాపని తీరు నచ్చితేనే మాకు ఓటు వేయండి లేకుంటే వద్దు’ అని చెప్పగల ధైర్యం సిఎం కేసీఆర్‌కు, తెరాసకు మాత్రమే ఉందని చెప్పక తప్పదు. ఆ ధైర్యం ఎందుకంటే, సిఎం కేసీఆర్‌ చెప్పినట్లుగా గత నాలుగేళ్ళలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ కళ్ళకు కనబడుతున్నాయి కనుకనే. తెరాస ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 400కు పైగా సంక్షేమ పధకాలలో ఏదో ఒక పధకం ద్వారా రాష్ట్రంలో లబ్ది పొందనివారు లేరంటే అతిశయోక్తి కాదు కనుకనే కేసీఆర్‌ అంతా ధైర్యంగా తన పాలనకు ఈ ఎన్నికలు రిఫరెండంగా భావించి ఓటేయమని ప్రజలకు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు.


Related Post