ఇదేం సందేహం రెడ్డిగారు?

November 23, 2018


img

బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర బిజెపి సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డికి ఒక ధర్మసందేహం వచ్చింది. “ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలలో పర్యటించని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నికల ప్రచారానికి ఎందుకు వస్తున్నారు?మేడ్చల్ కాంగ్రెస్‌ అభ్యర్ధి సామా సతీష్ పై అవినీతి ఆరోపణలున్నాయి. ఆ అవినీతికి డిల్లీలోని కాంగ్రెస్‌ అధిష్టానానికి ఏమైనా సంబందం ఉందా? అందుకే సోనియాగాంధీ మేడ్చల్ సభకు తరలివస్తున్నారా?” అని ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి కనుక ఇంద్రసేనారెడ్డి కూడా ఏదో మాట్లాడినట్లుంది తప్ప అపార రాజకీయ అనుభజ్నుడైన ఆయన ఈవిధంగా అర్ధరహితంగా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. 

సోనియాగాంధీ గత రెండేళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కారణంగా కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలను రాహుల్ గాంధీకి అప్పగించి మెల్లగా రాజకీయాల నుంచి తప్పుకొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. బహుశః ఆ కారణంగానే కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైన నాలుగు రాష్ట్రాలలో ఆమె ఎన్నికల ప్రచారానికి వెళ్ళకపోయుండవచ్చు. అంతమాత్రన్న ఆమె తెలంగాణలో పర్యటించకూడదని ఎవరూ చెప్పలేరు కదా?  

ఈసారి ఎన్నికలలో గెలిచి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న కాంగ్రెస్‌ నేతలు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ చేత రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయించినట్లయితే ఆ సెంటిమెంటుతో ప్రజలు తమకు ఓట్లు వేయవచ్చని భావిస్తున్నారు. ఆ ఆలోచనతోనే వారు పట్టుబట్టి ఆమెను ఎన్నికల ప్రచారానికి రప్పిస్తున్నారని అందరికీ తెలుసు. అందుకే ఆమె పర్యటనకు ‘హైప్’ క్రియేట్ చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. వారి ఆలోచన ఫలిస్తుందా లేదా? అనే విషయం పక్కన బెడితే తెలంగాణలో ఆమె పర్యటన ఎన్నికల వ్యూహంలో భాగం మాత్రమేనని స్పష్టం అవుతోంది. కానీ ఇంద్రసేనారెడ్డి వంటి సీనియర్ నేత ఆమె పర్యటనపై ఇటువంటి అర్ధరహితమైన అనుమానాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉంది. 


Related Post