ఓడిపోతే హాయిగా ఇంటికాడ పడుకొంటా: కేసీఆర్‌

November 22, 2018


img

ఇవాళ్ళ ఖానాపూర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “తెరాస ఓడిపోతే నాకేమీ నష్టం లేదు. తెలంగాణ ప్రజలు, రాష్ట్రమే నష్టపోతుంది. నేను హాయిగా ఇంటివద్ద పడుకొని రెస్ట్ తీసుకొంటా. వ్యవసాయం చేసుకొంటా. ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు చూస్తూ ఊరుకొంటాడా? మన ప్రాజెక్టులు పూర్తి కానిస్తాడా? ఆయనకు ఆంద్రా మీద ఉన్న ప్రేమ మన మీద ఎందుకుంటుంది?తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ తన గుప్పిట్లో తెచ్చుకోవడానికే చంద్రబాబు నాయుడు మహాకూటమిలో ముసుగులో మళ్ళీ వస్తున్నారు. కనుక మహాకూటమికి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి,” అని అన్నారు. 

సెప్టెంబరు 6న అసెంబ్లీని రద్దు చేసినప్పుడు తెరాస 110 స్థానాలు గెలుచుకొంటుందని పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రకటించిన కేసీఆర్‌, ఎన్నికలకు రెండు వారాల ముందు తెరాస ఓటమి గురించి మాట్లాడుతుండటం చూస్తే తెరాసలో అంతర్గతంగా ఆ భయం నెలకొని ఉందని స్పష్టమవుతోంది. ‘తెరాస ఓడిపోతే ఎలాగూ కేసీఆర్‌ తన ఇంటికివెళ్ళి పడుకోక తప్పదు’ అని కోదండరామ్‌ అన్నారు. ఆ మాటలు నిజమే. నిజానికి మహాకూటమి ఓడిపోయినా వారు కూడా అదే చేస్తారు. 

అయితే తెరాస ఓడిపోతే నిజంగానే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పధకాలు, సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోతాయా? మహాకూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏదో అనర్ధం జరిగిపోతుందనే తెరాస వాదనకు మహాకూటమిలో నాలుగు పార్టీలు ప్రజలకు సంతృప్తికరమైన సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అప్పుడే ప్రజలు దానికి ఓట్లు వేసి అధికారం కట్టబెట్టవచ్చా లేదా అని నిర్ణయించుకోగలుగుతారు.


Related Post