టిడిపి అభ్యర్ధికి బిజెపి నేత ఆశీర్వాదం!

November 22, 2018


img

ఎన్టీఆర్ బ్రతికి ఉండి ఉంటే నేడు టిడిపి ఏవిధంగా ఉండేదో తెలియదు కానీ ఆయన మరణించడంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వేర్వేరు పార్టీలలో చేరడంతో వారి మద్య రాజకీయ శతృత్వం అనివార్యమైంది. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా ఒక వెలుగు వెలిగిన పురందేశ్వరి గత ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. వైకాపాలో చేరిన ఎన్టీఆర్ అర్ధాంగి లక్ష్మీ పార్వతి చంద్రబాబు నాయుడుని ఎంతగా ద్వేషిస్తారో, పురందేశ్వరి కూడా ఆయనను అంతగానే ద్వేషిస్తారనేది బహిరంగ రహస్యమే. కారణాలు అందరికీ తెలుసు. టిడిపి-బిజెపిల మద్య మంచి స్నేహ సంబందాలున్నప్పుడు కూడా ఆమె బాబుకు చురకలు వేస్తుండేవారు. అటువంటిది టిడిపి-బిజెపిలు విడిపోయి రాజకీయ శత్రువులుగా హోరాహోరీగా యుద్దం చేస్తున్నప్పుడు, పురందేశ్వరి టిడిపి అభ్యర్ధికి మద్దతు ఇస్తారని ఊహించలేము. కనుక బుదవారం ఆమె మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు మహాకూటమిని ఓడించాలని గట్టిగా నొక్కి చెప్పారు.

కానీ ఆమె కూకట్ పల్లి నుంచి టిడిపి అభ్యర్ధిగా బరిలోకి దిగిన తన సోదరుడు స్వర్గీయ హరికృష్ణ కుమార్తె సుహాసినికి మద్దతు పలుకుతారా లేదా? అనే సందేహం కలగడం సహజమే. ఆమెను ఒక విలేఖరి ఇదే ప్రశ్న అడుగగా పురందేశ్వరి చాలా లౌక్యంగా సమాధానం చెప్పి తప్పించుకొన్నారు. “పార్టీల పరంగా వ్యతిరేకించవలసి వచ్ఛినప్పటికీ ఒక మేనత్తగా నా మేనకోడలుకి నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి,” అని నవ్వుతూ చెప్పారు. అంటే కూకట్ పల్లిలో బిజెపి అభ్యర్ధి  తరపున ఆమె ఎన్నికల ప్రచారం చేయకపోవచ్చునని భావించవచ్చు. మేనకోడలుకి అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంటుంది? 


Related Post