రాములమ్మ సందేహం

November 22, 2018


img

కాంగ్రెస్‌ స్టార్ కేంపెయినర్ విజయశాంతికి ఊహించని ఒక సమస్య ఎదురైంది. నిజానికి ఈ సమస్య ఆమె ఒక్కరికే కాదు కాంగ్రెస్ నేతలందరూ ఎదుర్కొంటున్నారు. మహాకూటమిలో భాగంగా నాలుగు పార్టీలు సీట్లు సర్దుబాట్లు చేసుకొన్నప్పటికీ కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్‌-టిజేఎస్ రెండు పార్టీలు తమ అభ్యర్ధులను నిలబెట్టాయి. మరికొన్ని చోట్ల కాంగ్రెస్‌ రెబెల్ అభ్యర్ధులు కూడా బరిలో ఉన్నారు. 

పటాన్ చెరు నియోజకవర్గం టిడిపికి కేటాయించినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్ధిగా శ్రీనివాస్ గౌడ్ కు బి-ఫారం కేటాయించింది. అయితే టిడిపి అక్కడి నుంచి నామినేషన్ వేయలేకపోవడంతో కాంగ్రెస్‌ అభ్యర్ధి శ్రీనివాస్ గౌడ్ బరిలో మిగిలారు. ఇబ్రహీంపట్నంలో కూడా ఇదేవిధంగా జరగడం విశేషం. ఆ స్థానాన్ని టిడిపికి కేటాయించగా ఆ పార్టీ తరపున సామ రంగారెడ్డి నామినేషన్ వేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్ధిగా మల్ రెడ్డి రంగారెడ్డిని బరిలో దింపడంతో టిడిపి పోటీ నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. 

ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని టిజేఎస్ కు కేటాయించగా ఆ పార్టీ తరపున గాదె ఇన్నయ్య నామినేషన్ వేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి గాయత్రి రవిని పోటీలో దింపింది. అదేవిధంగా టిజేఎస్ కు కేటాయించిన దుబ్బాక నియోజకవర్గంలో రాజ్ కుమార్‌ బరిలో ఉండగా అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా మద్దెల నాగేశ్వర్ రెడ్డిని బరిలో దింపింది. టిడిపికి కేటాయించిన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎర్ర శేఖర్ నామినేషన్ వేయగా, టిజేఎస్ తరపున రాజేందర్ రెడ్డిని కూడా బరిలో దింపింది.  

ఇక టిజేఎస్ కు కేటాయించిన మిర్యాలగూడలో ఆ పార్టీ తరపున విద్యాధర్ రెడ్డి నామినేషన్ వేయగా, కాంగ్రెస్‌ పార్టీ ఆర్.కృష్ణయ్యకు బి ఫారం ఇచ్చి బరిలో దింపింది. కనుక ఈ నియోజకవర్గాలలో మిత్రపక్షాల మద్య స్నేహపూర్వక పోటీ అనివార్యమని స్పష్టం అవుతోంది.

కనుక ఆ నియోజకవర్గాలలో తాను ఎవరి తరపున ప్రచారం చేయాలని విజయశాంతి రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలను అడిగారు.

టిజేఎస్ అభ్యర్ధి బరిలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్ధి తరపున ప్రచారం చేసినట్లయితే కాంగ్రెస్‌, టిజేఎస్ కార్యకర్తలు అయోమయం చెందే అవకాశం ఉంది. పైగా తెరాస, బిజెపిలు దీనిని ఒక ఆయుధంగా మలుచుకొని ఓటర్లలో కూడా అయోమయం సృష్టించి మహాకూటమిని దెబ్బ తీయవచ్చు. కానీ ఒకే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌, టిజేఎస్ లేదా కాంగ్రెస్‌-టిడిపి అభ్యర్ధులు బరిలో ఉన్నప్పుడు తాను ఎవరి తరపున ప్రచారం చేయాలని విజయశాంతి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కనుక ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా విజయశాంతి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరినట్లు తెలుస్తోంది. 

టిజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌ కూడా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ రెబెల్ అభ్యర్ధులను ఉపసంహరించడానికి కాంగ్రెస్‌ పెద్దలు తెర వెనుక గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ ఆర్.కృష్ణయ్య వంటి వారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా బి-ఫారం అందజేసి కాంగ్రెస్‌ అభ్యర్ధులుగా పోటీకి దింపినందున ఆ నియోజకవర్గాలలో కాంగ్రెస్‌-టిజేఎస్ మద్య స్నేహపూర్వకపోటీ తప్పదనే చెప్పవచ్చు. 


Related Post