కాంగ్రెస్‌-టిడిపిల ఓట్లు బదలాయింపు జరుగుతుందా?

November 22, 2018


img

రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు, కాంగ్రెస్‌-టిడిపి ఓట్లు పరస్పరం బదిలీ చేసుకొనేందుకు ఆ రెండు పార్టీలు మహాకూటమి వేదికగా చేతులు కలిపాయి. అయితే వాటి లెక్కలు ఫలిస్తాయా లేదా అంటే ఫలించవని సిఎం కేసీఆర్‌ నమ్మకంగా చెపుతున్నారు. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. 

ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో సాంప్రదాయ ఓటు బ్యాంకులు ఉన్న మాట వాస్తవం. టిడిపికి ఆంధ్రా ఓటర్లు, కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓటర్లు అండగా నిలుస్తారనే భావన ఉంది. కనుక ఆ రెండు వర్గాల ఓటర్లు కాంగ్రెస్‌ లేదా టిడిపి అభ్యర్ధులకే ఓట్లు వేస్తారని ఆ పార్టీలు లెక్కలు కట్టుకొన్నాయి. 

అయితే తెరాస బహిరంగంగానే మజ్లీస్ పార్టీతో చేతులు కలిపింది. అలాగే తెరాస ప్రభుత్వం మైనార్టీల కోసం అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తోంది కనుక వారు తెరాసవైపు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ తెరాస ఒకపక్క మజ్లీస్ పార్టీతో దోస్తీ చేస్తూనే మరోపక్క బిజెపితో కూడా రహస్య సంబంధాలు కొనసాగిస్తున్నట్లు అనుమానాలున్నాయి. ఎన్నికల తరువాత కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కేసీఆర్‌ చెపుతున్నప్పటికీ, ఆయన కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటుకు అన్ని విధాలా సహకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ కారణంగా మైనార్టీలు కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపవచ్చు. కనుక వారిని కాంగ్రెస్‌ పార్టీ ఏమేరకు ఆకర్షించగలుగుతుందనేది మహాకూటమి విజయావకాశానికి చాలా కీలకంగా మారనుంది.    

ఎప్పటిలాగే ఈసారి కూడా ఆంధ్రా ఓటర్లు నిర్ణయాత్మకంగా నిలువబోతున్నారు. ఎందుకంటే, శేరిలింగంపల్లిలో 3.8 లక్షలు, కుత్బుల్లా పూర్-2 లక్షలు, కూకట్ పల్లి-1.2 లక్షలు, రాజేంద్ర నగర్- లక్ష, మల్కాజ్ గిరి-60-70,000, మేడ్చల్-80,000, పటాన్ చెరు-75,000, సనత్ నగర్, మహేశ్వరం-30-40,000, భద్రాచలం, పినపాక-30,000, సత్తుపల్లి, ఖమ్మం, బాన్సువాడ, ములుగు, సికింద్రాబాద్‌, ముషీరాబాద్, ఇబ్రాహీంపట్నం, కోదాడలో ఒక్కో నియోజకవర్గంలో సుమారు 25-30,000 మంది ఆంధ్రా ఓటర్లున్నారు. అలాగే బోధన్, నిజామాబాద్ రూరల్, మంచిర్యాల, అశ్వారావుపేట, కొత్తగూడెం, మధిర, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ తదితర నియోజకవర్గాలలో కూడా 10-15,000 మంది ఆంధ్రా ఓటర్లున్నారు.  

ఈసారి ఎన్నికలలో తెరాస నేతలు ముఖ్యంగా సిఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు నలుగురూ ఏపీ సిఎం చంద్రబాబునాయుడు పట్ల చాలా అనుచితంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తునందున ఈ ఆంధ్రా ఓటర్లలో అధికశాతం మహాకూటమి వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. కనుక ఆ మేరకు కాంగ్రెస్‌, టిడిపిలు లబ్ది పొందవచ్చు. కానీ టిడిపిని అభిమానించేవారు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీని అభిమానించేవారు టిడిపికి ఓట్లు వేస్తారా లేదా అనేదే పెద్ద ప్రశ్న. ఆవిధంగా ఓట్ల బదలాయింపు జరుగుతుందని మహాకూటమిలో పార్టీలు భావిస్తుంటే, అన్ని వర్గాల ప్రజల కోసం తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని తెరాస భావిస్తోంది. ఎవరి లెక్కలు ఫలిస్తాయో డిసెంబరు 11వ తేదీన తేలిపోతుంది. 


Related Post